రాష్ట్ర కబడ్డీ సంఘం కార్యదర్శి తొలగింపు
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్‌ను రాష్ట్ర కబడ్డీ సంఘం ఏకగ్రీవ తీర్మానంతో తొలగించినట్లు ఆదివారం పేర్కొన్నారు. ఈ సమావేశాన్ని రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు మహ్మద్ అజీజ్ ఖాన్ ఆధ్వర్యంలో చిత్ర లేఅవుట్లోని మహాత్మాగాంధీ లా కాలేజ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా... గత ఏడాది తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీల్లో వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఆడిన క్రీడాకారులకు పారితోషికం ఇవ్వకపోవటం, దాదాపు ఒక కోటి రూపాయలమేర జగదీశ్వర్ యాదవ్ ఏం చేశాడని సంఘం సభ్యులు సందేహాలను లేవనెత్తారు. జాతీయ స్థాయిలో కబడ్డీలో ఓనమాలు తెలియని వారిని రప్పించి కబడ్డీ ఆడించటం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ఆడిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, ఇతరులకు జాతీయ స్థాయి సర్టిఫికెట్లు ఇవ్వడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. గత ఏడాది సీనియర్ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో హైదరాబాద్ పురుషుల జట్టును ఒకేరోజు రెండుమార్లు ఓడించిన నల్గొండ జట్టు రాష్ట్రంలో ప్రథమ స్థానం కైవసం చేసుకోగా ఆ జట్టు నుంచి ఒకరిని, ఓడిన హైదరాబాద్ జట్టు నుంచి నలుగురిని జాతీయస్థాయికి ఎంపిక చేయడం పట్ల జగదీశ్వర్ యాదవ్ చర్యను సమావేశంలో ప్రత్యేకంగా ప్రశ్నించారు. ఒంటెత్తు పోకడల వల్ల అతడి లోపాలను రాష్ట్ర, జాతీయ కబడ్డీ క్రీడాకారులు గళం ఎత్తి ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగదీశ్వర్ యాదవ్ అండదండలతో రాష్ట్ర సంఘం సంయుక్త కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా సంఘం అధ్యక్షుడు పి.సత్యనారాయణ సంఘ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడన్నారు. నల్గొండ జిల్లా కార్యదర్శి జి.కర్తయ్యకు పూర్తి మెజారిటీ వున్నా అవిశ్వాస తీర్మానం డ్రామాకు తెరలేపి కర్తయ్యను తొలగించటం పట్ల పి.సత్యనారాయణ చర్యను సభ్యులు తప్పుబడుతూ ఇరువురినీ తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో 31 జిల్లాల సభ్యులు పాల్గొన్నారు.