ఎన్.గోపీ, జగన్నాథశర్మలకు దాట్ల సాహితీ పురస్కారాలు
యానాం టౌన్ : యానాంకు చెందిన కవి, కథకుడు దాట్ల దేవదానంరాజు సాహితీ సంస్థ పురస్కారాలను ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్.గోపి, ప్రముఖ కథా రచయిత ఏఎన్ జగన్నాథశర్మలకు ప్రదానం చేశారు. స్థానిక చిల్డ్రన్స్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ శిఖామణి అధ్యక్షతన జరిగిన సభలో దాట్ల దేవదానంరాజు దంపతులు.. గోపి, జగన్నాథశర్మలకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ కవి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ద్వా.నా.శాస్త్రిల సమక్షంలో వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు, రూ.10 వేల నగదు అందించారు.