ఏసీబీ వలలో ఆర్టీఏ ఉద్యోగి
అత్తాపూర్, న్యూస్‌లైన్: ప్రైవేట్ బస్సుకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.30 వేల లంచం తీసుకుంటూ అత్తాపూర్ ఆర్టీఏ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ ప్రభాకర్ కథనం ప్రకారం... ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ మోహినుద్దీన్ 2013 అక్టోబర్‌లో శ్రీరాం ఫైనాన్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఆక్షన్ మేళాలో బస్సు (ఏపీ 28 టీబీ 4545)ను కొనుగోలు చేశారు. ఈ బస్సును తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసి వరంగల్‌లో నడిపించేందుకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించారు.
అప్పటికే బస్సుపై వివిధ టాక్స్‌ల రూపంలో రూ. 5 లక్షల బకాయి ఉంది. దీన్ని చెల్లిస్తే క్లియరెన్స్ ఇస్తామని ఆర్టీఏ అధికారులు చెప్పడంతో మోహినుద్దీన్ శ్రీరాం ఫైనాన్స్‌ను సంప్రదించగా వారు తమకు సంబంధంలేదన్నారు. దీంతో మోహినుద్దీన్ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం రూ.2 లక్షల 86 వేలు కట్టాలని తీర్పు ఇవ్వడంతో ఆ మొత్తాన్ని ఆయన డీడీ ద్వారా జమ చేశారు. ఈనెల 16న అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేశారు. ఈ ఫైల్ సీనియర్ అసిస్టెంట్ జగన్నాథ్‌నాయక్ వద్దకు వెళ్లింది. తనకు రూ. 50 వేలు లంచం ఇస్తేనే క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.
అంత ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పడంతో ఫైల్‌ను తన వద్దే ఉంచుకున్నారు. ఎట్టకేలకు మోహినుద్దీన్ మంగళవారం రూ. 30 వేలు ఇస్తానని చెప్పడంతో జగన్నాథ్‌నాయక్ పని పూర్తి చేసేందుకు ఒప్పుకున్నారు. బాధితుడు ఈవిషయాన్ని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్‌కు ఫిర్యాదు చేయడంతో వారు సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకొనేందుకు వల పన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మోహినుద్దీన్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి డబ్బులు తెచ్చానని చెప్పాడు.
క్లియరెన్స్ సర్టిఫికెట్ ప్రింట్ తీసిన జగన్నాథ్‌నాయక్ డబ్బును తన సహాయకుడు రమేష్‌కు ఇవ్వాలని సూచించారు. మోహినుద్దీన్ నుంచి రమేష్ లంచం డబ్బు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాను జగన్నాథ్నాయక్కు సహాయకుడిగా పని చేస్తున్నానని, అతని సూచన మేరకే డబ్బు తీసుకున్నానని ఏసీబీ అధికారుల విచారణలో రమేష్ వెల్లడించాడు. దీంతో ఏసీబీ అధికారులు జగన్నాథ్నాయక్తో పాటు రమేష్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ వెంకట్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.