Maha Shivaratri 2023: పాహి పాహి పరమేశ్వరా
సృష్టి, స్థితి, లయకారులలో శివుడికి లయకారుడని పేరు. అయితేనేం, ఆయన పరమ బోళావాడు. భక్తజన రక్షకుడు. సనాతనుడు, భూతనాథుడు, వైద్యనాథుడు, పశుపతి నాథుడు, చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు, చంద్రశేఖరుడు. భక్తితో కొలిచే తన భక్తులతోపా పాటు క్రిమికిటకాదులకు కూడా మోక్షమిచ్చి సాక్షాత్కరించే శివయ్య దర్శనం సర్వ పా పాపహరణం. నేడు మహాశివరాత్రి పర్వదినం.
ఈ పర్వదినాన ఆ శుభకరుడి గురించి చెప్పుకోవడం ఎంతో మంగళప్రదం. మనం ప్రతి నెలలోనూ తెలుగు క్యాలెండర్లలోనూ, పంచాంగాల్లోనూ పండుగలు– పర్వదినాలలో మాస శివరాత్రి అని ఉండటాన్ని చూస్తూంటాం. ఇంతకీ మాస శివరాత్రి అంటే ఏమిటి, మహాశివరాత్రికీ, మాస శివరాత్రికీ గల వ్యత్యాసం ఏమిటో చూద్దాం.
ప్రతిమాసంలోనూ బహుళ పక్షం వచ్చే చతుర్ధశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి. వాటన్నింటిలోనూ తలమానికమైనది, మహిమాన్వితమైనది మహాశివరాత్రి. తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందురోజు – రాత్రి చతుర్దశి కలిగి ఉన్న రోజుని జరుపుకోవాలని నిర్ణయ సింధు చెబుతోంది.
‘మహా’ అని ఎక్కడ అనిపించినా అన్నింటికంటే గొప్పదని అర్థం చేసుకోవాలి. శివ పా పార్వతులిరువురికి సంబంధించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం. అందుకే శివరాత్రి నాడు అయ్యకి – అమ్మకి కూడా ఉత్సవం జరుగుతుంది. శివ అంటే మంగళకరమైన అని. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం.
ఇంతకీ శివరాత్రి ఎందుకని అంతటి పర్వదినమైందో చూద్దాం.
క్షీరసాగర మథనంలో అమృతంకంటే ముందు హాలాహలం పుట్టిన విషయం తెలిసిందే. అది ముల్లోకాలను దహించివేస్తుందన్న ప్రమాదం ఉండడంతో దేవదానవులందరు భీతావహులై తమను రక్షించాలంటూ పరమేశ్వరుణ్ణి వేడుకోవడంతో లోక రక్షణార్థం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి గరళ కంఠుడుగా పేరుపొందాడు.
ఈ హాలాహల ప్రభావానికి ఆయన కంఠం నీలంగా మారడంతో నీలకంఠుడయ్యాడు. లోకాలన్నీ ఆ లోకనాయకుడి మూలాన స్థిమితపడిన రోజు పర్వదినం గాక మరేమిటి?అయితే... సంప్రదాయ ప్రియులు జరుపుకునే ప్రతి పండుగకూ ఏదో ఒక పురాణగాథ ఉన్నట్లే మహాశివరాత్రికీ ఒకటి రెండు ఐతిహ్యాలున్నాయి.
ఆది మధ్యాంత రహితుడు
పరమేశ్వరుడు ఆది మధ్యాంత రహితుడనడానికి సంబంధించిన ఈ గాథని చూద్దాం: పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప ’ అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్తా వివాదం గా మారింది. రానురానూ అది మరింతగా పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధానికి త్రిలోకాలూ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు.
ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మవిష్ణువుల మధ్య వెలసింది. ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పో రు కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగి ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తిగా మారింది. దాంతో బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు శ్వేతవరాహరూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు.
ఎంతదూరం ఎగిరినా బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహరూపంలో ఉన్న విష్ణువు పా పాతాళందాటి వెళ్లినా లింగం మొదలు కనిపించ లేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ మొగలిపువ్వును ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన సంవాదాన్ని వివరించి, తనకు సహాయం చేయమని అడిగాడు. ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజ మేనని సాక్ష్యం ఇవ్వమనిప్రా పాధేయపడ్డాడు బ్రహ్మ.
సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేకపో యింది మొగలిపువ్వు. వారిద్దరూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపో యానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలిపువ్వును అడగమని చెప్పా డు. ‘నిజమే’నంది మొగలిపువ్వు.దాంతో తాను ఓడిపో యానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.
బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం అంటే మొగలిపువ్వు నాటినుంచి తనను అర్చించడానికి అవకాశం లేదన్నాడు. అంతేకాదు భక్తులెవ్వరూ మొగలిపువ్వులతో తనను పూజించరాదని శాసించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండీ అల్పవిషయంలో అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకుని, భూలోకంలో తనతో సమానంగా పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు.
అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఈశ్వరుణ్ణి శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చుండబెట్టారు. హారాలు, నూపురాలు, కిరీటం, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్త్రాలు, పూలమాలలు, పువ్వులు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, శ్వేతఛత్రం, వింజామరలు వంటి దివ్యమైన వస్తువులను సమర్పించి షోడశోపచారంగా పూజించారు. ఆ పూజకు ఈశ్వరుడు ఎంతగానో సంతోషించాడు.
జ్యోతిర్లింగరూపంలో బ్రహ్మకు, విష్ణువుకు తాను కనిపించిన సమయాన్ని లింగోద్భవకాలంగా పరిగణించాలని, ఇకనుంచి మాఘబహుళ చతుర్ధశి శివరాత్రి అనే పేరుతో తన పూజలకు శ్రేష్ఠమైనదిగా వర్థిల్లుతుందని చెప్పా డు. అంతేకాదు, ఆ తిథినాడు తన మూర్తిని, లింగాన్ని పూజించే వారికి మోక్షం లభిస్తుందన్నాడు. శివరాత్రినాడు పా పార్వతీసమేతంగా తనను అర్చించే వారు మహోన్నత ఫలాలు పొందే విధంగా అనుగ్రహించాడు.
మహాశివరాత్రి పండుగను జరుపుకోవడంలో మూడు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపా పాన్ని ధ్యానిస్తూ, శివ నామస్మరణం చేయడం.
మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు.. నాలుగు జాములు నిద్రపో కుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కాంధ పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పా పాపా పాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో, ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివ గాథలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.
శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజుకి ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపా పాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రి కి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.
ఉపవాసం ఎలా?
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేషప్రా పాధాన్యం ఉంది. శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.
ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపా పానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా, శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి.
ఉపవాసం అనే పదానికి అర్థం ‘దగ్గరగా ఉండడం’ అని! భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు, ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పా పాటు శరీరంలోప్రా పాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం కష్టం.
శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. అంతేకాదు జాగారం వుండి శివ పంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారాయన భక్తులు. కనుకనే మహాశివరాత్రి నాడు నమశ్శివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ. ‘త్రయంబకం యజామహే...‘ అంటూ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలూ తగ్గి, పూర్ణాయుష్షు లభిస్తుందని ప్రతీతి. శివరాత్రి నాడు కలిగినంతలో దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. ఇవేవీ చేయ(లే)కపో యినా నిర్మలమైన మనస్సు తో వీలైనన్ని సార్లు ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేసినా చాలు, ఆ బోళాశంకరుడుపొంగిపో యి వరాలిస్తాడు.
ఆయన రూపం అపురూపం
శివుడు నిరాకారుడు. సాకారుడు కూడా. అదే ఆయన ప్రత్యేకత. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపా పాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక.
శివుడి దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.
రెండు స్వరూపా పాలు
శివుడు కేవలం రుద్రస్వరూపుడే కాక ప్రేమస్వరూపుడు కూడా. రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు.
జగతః మాతా పితరౌ
శివ పార్వతులు తమ కల్యాణ మహోత్సవానికి చక్కగా చిగిర్చే పూచే వసంతకాలాన్ని మనకిచ్చి ఆకులు రాలే శిశిరాన్ని ఎంచుకున్నారు ఆ దంపతులు. వెన్నెల మెండుగా కాసే పున్నమిని మనకిచ్చి కన్ను పొడుచుకున్నా కానరాని బహుళ చతుర్దశిని తాము తీసుకున్నారు. రాత్రివేళ అయితే అది మనకి ఇచ్చింది అని భావించి తెల్లవారుజామున మంచిదనుకున్నారు ఆ తలిదండ్రులు.
మల్లెల్నీ మొల్లల్నీ మనకి విడిచి వాసన, రూపసౌందర్యం లేని తుమ్మిపూవుల్ని సిద్ధం చేసుకున్నారు. చందనాన్ని మన పరం చేసి విభూతిని పులుముకున్నారు. ఊరేగింపునకి ఎద్దునీ, అలంకారాలుగా పా పాముల్నీ ... ఇలా జగత్తుకోసం ఇన్ని త్యాగాలు చేసిన ఆ ఆది దంపతుల కల్యాణ మహోత్సవానికి పిల్లలమైన మనం తప్పక హాజరు కావాలి. ఆశీస్సులు అందుకోవాలి. అందుకే ఈ జాగరణం.
– డి.వి.ఆర్.