మొద్దు నిద్రలో సిద్ధు సర్కార్
నిప్పులు చెరిగిన శెట్టర్
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రలో ఉందని శాసనసభ విపక్షనేత జగదీష్శెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకుని అనుమానాస్పద స్థితిలో మరణించిన కలెక్టర్ డీ.కే రవి కుటుంబ సభ్యులకు ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హుబ్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
డీ.కే రవి మరణించి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకూ వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందలేదన్నారు. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరే కారణమని అభిప్రాయపడ్డారు. అందువల్లే డీ.కే రవి వర్ధంతికి ఆయన తల్లి బంగారు అభరణాలను కుదువ పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి డీ.కే రవి కుటుంబ సభ్యులను ఆదుకోవాలన్నారు.