JAGGAYYAPETA Municipal Chairman
-
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా రాజగోపాల్
జగ్గయ్యపేట/జగ్గయ్యపేట అర్బన్: అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా జగ్గయ్యపేట మున్సిపాలిటీలో న్యాయమే గెలిచింది. మున్సిపల్ చైర్మన్ పదవిని మరోమారు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా ఇంటూరి రాజగోపాల్ (చిన్నా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రెండురోజుల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. వాస్తవానికి చైర్మన్ ఎన్నికను శుక్రవారమే నిర్వహించాల్సి ఉంది. అయితే టీడీపీ నేతలు కౌన్సిల్ హాల్లో అరాచకంగా వ్యవహరించడంతో ఎన్నికల అ«ధికారి, విజయవాడ సబ్ కలెక్టర్ హరీశ్ ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో శనివారం పూర్తి బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించారు. టీడీపీ నాయకులు శుక్రవారం వ్యవహరించిన తీరును దృష్టిలో ఉంచుకుని పోడియం చుట్టూ, టీడీపీ, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల సీట్ల మధ్య కంచె ఏర్పాటుచేశారు. ఉదయం 10 గంటలకే వైఎస్సార్సీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు. 11 గంటల సమయంలో టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని, స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, టీడీపీ కౌన్సిలర్లు వచ్చారు. నేరుగా ఎన్నికల అధికారి హరీశ్ ఉన్న పోడియం వద్దకు వెళ్లారు. తమ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని, వారు వచ్చేవరకు ఎన్నికను వాయిదా వేయాలంటూ మరోమారు ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారు. అయితే కోరం ఉన్నందున ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో తాము ఎన్నికను బహిష్కరిస్తున్నామని చెప్పి టీడీపీ నేతలు బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. చైర్మన్ అభ్యర్థిగా ఇంటూరి రాజగోపాల్ (చిన్నా)ను ప్రతిపాదిస్తున్నట్లు 10వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ అక్బర్ చెప్పగా, 3వ వార్డు కౌన్సిలర్ జన్నుమహంతి అనంతలక్ష్మి బలపరుస్తున్నట్లు చెప్పటంతో చైర్మన్‌గా చిన్నా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆయనతో ప్రమాణస్వీకారం చేయించి, నియామకపత్రాన్ని అందజేశారు. ఈ ఎన్నిక ప్రక్రియను జాయింట్ కలెక్టర్ కె.విజయన్, జేసీ–2 పి.బాబూరావు పర్యవేక్షించారు. -
జగ్గయ్యపేటలో ధర్మం గెలిచింది
సాక్షి, హైదరాబాద్ : అధికారం అండతో టీడీపీ దౌర్జన్యం చేయాలని యత్నించినా చివరకు ధర్మమమే గెలిచిందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి తెలిపారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విజయంపై వైఎస్సాఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు. ముఖ్యనేతలు, కార్యకర్తలు ఇలా అంతా వచ్చి భయానక వాతావరణం సృష్టించినా ప్రభుత్వం పాచికలు పారలేదని పార్థసారథి తెలిపారు. చివరకు అధికారులపై దాడికి కూడా ప్యూహరచన చేశారని.. మానసిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నించారని ఆయన అన్నారు. ఎన్నికల అధికారి ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఎంపీ నేతృత్వంలో దాడి చేసేందుకు పోడియం చుట్టు చేరారని ఆయన అన్నారు. వారి దౌర్జన్యకాండ మొత్తం మీడియాలో ప్రజలంతా చూశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలతో పనులు చేయించుకోవటమే పనా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారంటూ వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, చైర్మన్ అభ్యర్థి మీద అక్రమ కేసులు బనాయించారని.. బెదిరింపులకు కూడా పాల్పడ్డారన్నారు. చివరకు శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఎలాగైనా సరే ఎన్నికలు ఆపేందుకు తీవ్రంగా యత్నించారని, ఒకవేళ అనుకూలంగా వ్యవహరించి ఉంటే మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక రచించారని చెప్పారు. ఎన్ని కుట్రలు పన్నినా చివరకు ధర్మమే గెలిచిందని తెలిపారు. వచ్చే రోజుల్లో కూడా పార్టీ కార్యకర్తలు.. ప్రజా ప్రతినిధులు ఒకేతాటిపైకి వచ్చి పోరాడతామని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని పార్థసారథి స్పష్టం చేశారు. -
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అరెస్ట్.. బెయిల్
కేబుల్ నెట్వర్క్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు జగ్గయ్యపేట అర్బన్: నిబంధనలను అతిక్రమించి ప్రసారాలు చేస్తున్నారన్న అభియోగంపై శ్రీసాయిసూర్య డిజిటల్ కేబుల్ నెట్వర్క్ యాజమాన్య ప్రతినిధి, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 12.30 సమయంలో మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో ఉన్న తన్నీరును సీఐ వై.వి.వి.ఎల్.నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. సన్నెట్ వర్క్ ప్రతినిధి జి.సంగమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 420 ఐపీసీ సెక్షన్ 51,63,65 కాపీరైట్ యాక్ట్ కింద తన్నీరును అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అనంతరం తన్నీరును కోర్టుకు తరలించిన పోలీసులు.. అక్కడ హాజరుపర్చకుండా సంతకం చేయాలంటూ తిరిగి స్టేషన్‌కు తీసుకొచ్చారు. రెండు గంటలు తరువాత మళ్లీ కోర్టుకు తీసుకెళ్లారు. పొద్దుపోయిన తరువాత తన్నీరుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయన విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా పోలీసులు తన్నీరును అరెస్టు చేశారని ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బి.శ్రీనివాసులు తీర్పులో పేర్కొన్నారు.అరెస్ట్ సమాచారంతో వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ధర్నా చేశాయి.