తెలంగాణ కేసరి: కీసర జితేందర్‌రెడ్డి
కోదాడటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో సరిహద్దులో ఉన్న కోదాడ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉద్యమంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఆ ప్రభావం ఇక్కడ ఉండే ది. 1969లో జరిగిన జై తెలంగాణ, ఆంధ్రా గోబ్యాక్ ఉద్యమంలో ఈ ప్రాంత దివంగత నేత కీసర జితేందర్‌రెడ్డి ఉరఫ్ కేసరిరెడ్డి పోషించిన పాత్ర మరువలేనిది. వేలాది మంది ఒక వైపు ఉండి ఆవేశంతో దాడికి వస్తుంటే ధైర్యంగా ఒక్కరే ఎదురెళ్లి తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరగకుండా అడ్డుకున్నాడు. దాడులనుంచి కో దాడ వాసులను రక్షించారు.
నాటి తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తర్వాత కోదాడకు చెందిన రత్పవరం దొర, మాజీ ఎమ్మెల్యే దివంగత కీసర జితేందర్‌రెడ్డే ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలని నాటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి స్వయం గా కోదాడకు వచ్చి జితేందర్‌రెడ్డితో చర్చలు జరిపారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పినా ఆయన లొంగలేదు. తెలంగాణ ఉద్య మం ముమ్మరంగా జరుగుతున్న 1969లో కోదాడలో జరిగిన ఓ సంఘటన ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లింది. 2009 అక్టోబర్‌లో జితేందర్‌రెడ్డి మృతి చెందారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన నేపథ్యంలో ఆయనను తెలంగాణ వాదులు మరోసారి స్మరించుకుంటున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
1969లో తెలంగాణఉద్యమం ఉధృతంగా నడుస్తున్నది. అప్పటి మిర్యాలగూడెం ఎమ్మె ల్యే తిప్పన కృష్ణారెడ్డి, కోదాడ సమితి ప్రెసిడెంట్ కీసర జితేందర్‌రెడ్డిలు ఈ ప్రాంతంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబా ద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు కోదాడ మీదుగా జాతీయ రహదారి ఉంది. ఆ సమయంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన మహిళలపై తెలంగాణ ఉద్యమకారులు కోదాడ ఆర్టీ సీ బస్టాండ్ వద్ద, మిర్యాలగూడెంలో దాడులు చేస్తున్నారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కొన్ని అల్లరి మూ కలు ఆంధ్రాప్రాంతంలో పుకార్లు పుట్టిం చాయి. రెండు, మూడు రోజుల్లో ఇది ఆంధ్రా ప్రాంతమంతా దావనంలా వ్యాపించింది.
దీంతో విజయవాడ నుంచి గరికపాడు వరకు ఉన్న ఆంధ్రాప్రాంతం వాసులు ఆవేశంతో రగిలిపోయి కర్రలు, కత్తులు చేతబట్టుకుని వేలాదిగా కోదాడ వైపు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గరికపాడు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న తెలంగాణ వ్యక్తి.. జితేందర్‌రెడ్డికి చేర వేశారు. దీంతో కోదాడ మసీదు వద్ద సైరన్పెట్టారు. అది మోగితే అంతా కర్రలు, కారం పట్టుకుని దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ప్రచారం చేశారు. కానీ నాలుగు రోజుల తర్వాత మధ్యాహ్నం అల్లరి మూకలు వేలాదిగా ప్రత్యేక వాహనాల్లో కోదాడ వైపు తరలివస్తున్నాయని తెలుసుకున్న జితేందర్‌రెడ్డి.. కోదాడ కేఆర్ఆర్ కళాశాలకు చెందిన కొంత మంది విద్యార్థులతో కలిసి పాలేరు వంతెన వద్దకు చేరుకున్నారు. వంతెనపై రాళ్లతో గోడ కట్టారు. సాయంత్రం వేళ వేలాదిగా అల్లరిమూకలు ఆంధ్రావైపు నుంచి పాలేరు వంతెన వద్దకు చేరుకున్నాయి. వెనక్కి వెళ్లాల్సిందిగా జితేందర్‌రెడ్డి వారిని బతిమిలాడినా వినిపించుకోలేదు. ఈలోగా కొందరు వాహనాలతో రాళ్లగొడను ఢీకొట్టారు. వెంటనే జితేందర్‌రెడ్డి తనవద్ద ఉన్న లెసైన్స్ తుపాకితో కాల్పులు జరిపారు. భయపడిన అల్లరిమూకలు వెనక్కితగ్గి పారిపోయాయి. ఈ సంఘటనతో వారం రోజుల పాటు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయని ఆనాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న తాటికొండ బ్రహ్మానందం తెలిపాడు.
అడ్డుకోకపోతే అల్లరిమూకలు విధ్వంసం సృష్టించేవి
1969 తెలంగాణ ఉద్యమంలో కోదాడ కీలకంగా ఉండేది. కోదాడలోని కేఆర్ఆర్ కళాశాల విద్యార్థులు ఉద్యమంలో ముందుండేవారు. నాయకుడిగా కోదాడ సమితి అధ్యక్షుడు కీసర జితేందర్‌రెడ్డి ఎంతో ధైర్య సాహసాలతో వ్యవరించేవారు. అప్పటి మిర్యాలగూడెం ఎమ్మెల్యే తిప్పన కృష్ణారెడ్డికూడా తెలంగాణ ఉద్యమంలో బాగా పని చేసేవారు. నాడు జితేందర్‌రెడ్డి అడ్డుకోకపోతే అల్లరి మూకలు కోదాడ ప్రాంతంలో విధ్వంసం సృష్టించేవి. దానిని తలుచుకుంటేనే భయం అవుతుంది. ఏదైనా కీసర జితేందర్‌రెడ్డి కేసరిగా మారి తెలంగాణ ప్రజలను రక్షించారు.
జై తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు కోదాడలో అనేకమంది ఆంధ్రాపాంతంవారు నివసించేవారు. వారు ఇక్కడి నుంచి వెళ్లిపోతామని చెబుతుండటంతో నేను, జితేందర్‌రెడ్డి వారి వద్దకు వెళ్లి ప్రజలతో మాకు ఎటువంటి విభేదాలు లేవని, ఇక్కడ ఉన్న ఆంధ్రావారంతా మా సోదరులేనని వారి ఇళ్లకు వెళ్లి బతిమిలాడాము. వారిని వెళ్లకుండా అడ్డుకున్నాం. నేటికీ వారంతా కోదాడలోనే ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమం లో అరెస్ట్ అయిన జితేందర్‌రెడ్డిని వరంగల్ జైలుకు, చెన్నారెడ్డిని రాజమండ్రి జైలుకు, నన్ను హుజూర్నగర్ సబ్‌జైలుకు తరలించారు. వారం రోజుల తరువాత విడుదలైన మ మ్మల్ని కోదాడలో తెలంగాణవాదులు ఊరేగింపు తో స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమాన్నిఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభించిన సూర్యాపేట మం డలం రామన్నగూడెంకు చెందిన బొక్కా వెంకట్‌రెడ్డి, డాక్టర్ ఎం. శ్రీధర్‌రెడ్డి లను కోదాడకు తీసుకువచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేశాం. ఇప్పడు నాకు 74 ఏళ్ల వయస్సు. నేను బతికున్నంత కాలం తెలంగాణను చూస్తానో లేదో ననే బాధ ఉండేది. కానీ ఇపుడు మనసు కుదుటపడింది.
మంత్రిపై ఘనవిజయం
కీసర జితేందర్‌రెడ్డి 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఇండిపెం డెంట్‌గా పోటీ చేసి అప్పటి సమాచార శాఖ మంత్రిగా ఉన్న అక్కిరాజు వాసుదేవరావు(కాంగ్రెస్)పై 14,308 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.