Jail Riot
-
హొండురస్ జైల్లో 18 మంది ఖైదీల మృతి
టెగుసిగల్ప: సెంట్రల్ అమెరికాలోని హొండురస్ దేశ జైల్లో ఖైదీల మధ్య జరిగిన గొడవల్లో 18 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. ఆ దేశంలోని ఉత్తరభాగంలో నగరమైన టెలాలోని జైల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో 17 మంది జైల్లోనే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఖైదీల మధ్య గొడవ ఎందుకు జరిగిందో తమకు తెలియరాలేదని చెప్పారు. ఇటీవల ఇదే జైల్లో అయిదు మందిని మరో ఖైదీ కాల్చి చంపడంతో దేశంలోని జైళ్లను అన్నింటినీ ఆర్మీ అదుపులోకి తీసుకోవాలంటూ ఆ దేశాధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్ ఆదేశాలు జారీ చేశారు. జైలు ఆర్మీ అదుపులోకి రాలేదని జైలు అధికారి డిగ్నా చెప్పారు. -
జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. జైల్లో రెండు గ్రూపుల మధ్య జరిగిన దూషణలు... ఇరువర్గాల మధ్య దాడులకు కారణమైంది. చినికిచికిని గాలివానలా మారిన ఈ వ్యవహారం చివరకు షేవింగ్ బ్లేడ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకునేవరకూ వెళ్లింది. ఇదే అదునుగా కొందరు ఖైదీలు జైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అడ్డుకున్న ఒక సెక్యూరిటీ అధికారిపై దాడి చేశారు. ప్రస్తుతం అతని పరిస్ధితి బాగానే ఉందని జైలు సూపరింటిండెంట్ రాకేశ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన వెల్లడించారు. కాగా గడిచిన రెండు నెలల్లో దేశంలోని నాలుగు జైళ్లలో ఖైదీల మధ్య ఘర్షణలు జరిగాయి.