మళ్లీ వేడెక్కుతున్న జైతాపూర్
జైతాపూర్ అణువిద్యుత్ ప్రాజెక్టు వ్యతిరేక ఆందోళనలు తగ్గుముఖం పడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటిం చినా.. స్థానికులు మాత్రం తాము వెనక్కితగ్గే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మరోసారి భారీ ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు.
సాక్షి, ముంబై: వివాదస్పద జైతాపూర్ అణువిద్యుత్ ప్రాజెక్టు వ్యతిరేక ఆందోళనలు మరోసారి రాజుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అణువిద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ నెల 13వ తేదీ నుంచి ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు జైతాపూర్, చుట్టుపక్కల గ్రామస్తులు తాజాగా ప్రకటించారు. గతంలో మాదిరిగానే ర్యాలీలు, రాస్తారోకోలు, మోర్చా, ధర్నాలు ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. మొన్నటి వరకు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించిన ‘మాడ్బన్ జనహిత్ సేవాసమితి’ అధ్యక్షుడు ప్రవీణ్ గవాన్కర్ ఇప్పుడు మెతక వైఖరి అవలంభించడంతో ఉద్యమం నీరుగారిపోయిందని సమితి నాయకులు కొందరు భావించారు. తమను విశ్వాసంలోకి తీసుకోకుండా గవాన్కర్ తీసుకున్న నిర్ణయంతో వీరంతా తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. అణువిద్యుత్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మాడ్బన్ జనహిత్ సేవాసమితి అద్వర్యంలో గతంలోనూ అనేక ఆందోళనలు, రాస్తారోకోలు జరిగాయి. 2011లో నిర్వహించిన ఆందోళన సందర్భంగా పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు మరణించడం తెలిసిందే.
సందట్లో సడేమియా అన్నట్లుగా వీరికి మద్దతుగా నిలిచి రాజకీయంగా లబ్ధి పొందాలని శివసేన భావించింది. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి అన్నట్లు శివసేన పరిస్థితి మారిన విషయం తెలిసిందే. జైతాపూర్ గ్రామస్తులు, సమితి నాయకులు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో సేన ఊపిరిపీల్చుకుంది. ఇదిలాఉండగా జైతాపూర్‌లో 9,900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేసే అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి అవసరమైన 967 హెక్టార్ల స్థలాన్ని సేకరించి సిద్ధంగా ఉంచింది. ప్లాంటు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు జరిగాయి. గత వారం కిందట జన్హిత్ సేవా సమితి అధ్యక్షుడు గవాన్కర్, మిలింద్ దేశాయి పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణేతో చర్చించి కొంత మెతక వైఖరి ప్రదర్శించారు. నిర్వాసితులకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లే గవాన్కర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి. తమను పరిగణనలోకి తీసుకోకుండానే ఆయన సొంత నిర్ణయం తీసుకున్నార ని ఆరోపిస్తూ ‘జైతాపూర్, మాడ్బన్,
మీట్గావ్హాణే పంచ్క్రోషి సంఘర్ష్ సమితి’ ఆధ్వర్యంలో మరోసారి ఆందోళనకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు మచ్ఛీమార్ సంఘటన నాయకుడు అమ్జద్ బోర్కర్ కూడా మద్దతు ఇచ్చినట్లు సమితి ప్రధాన కార్యదర్శి శ్యామ్‌సుందర్ నార్వేకర్ చెప్పారు. ఇదివరకే ఈ ప్రాజెక్టును వ్యతిరేస్తున్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే త్వరలో గ్రామస్తుల బృందంతో భేటీ కానున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజన్ సాల్వీ చెప్పారు. ఒకవేళ ఇదే జరిగితే ఈ ప్రాజెక్టు కారణంగా ఇదివరకు చిక్కుల్లో పడిపోయిన శివసేన కచ్చితంగా రాజకీయంగా లబ్ధి పొందుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. సమితికి అధ్యక్షుడుగా ఉన్న గవాన్కర్కు 104 ఎకరాల సొంతస్థలం ఉంది.
ఈ స్థలానికి బదులుగా ఆయనకు రూ.తొమ్మిది కోట్లు లభిస్తాయి కాబట్టి ఆయన తన వైఖరి మార్చుకున్నట్లు బాధితుల నాయకుడు ప్రకాశ్ వాఘ్మారే ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్లాంటు ఏర్పాటును గ్రామస్తులు ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారని శివసేన అధిపతి ఉద్ధవ్‌ఠాక్రే సోమవారం పేర్కొనడం తెలిసిందే. ఉద్యమకారులు ఇప్పుడు వెనక్కితగ్గారంటూ పరిశ్రమలశాఖ నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘రాణేకు తప్పుడు వాగ్దానాలు చేసే అలవాటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జైతాపూర్ వాసులు ఇప్పటికీ ప్లాంటును వ్యతిరేకిస్తున్నారు’ అని అన్నారు. కాందివళిలో నిర్మించిన సివిల్ ఆస్పత్రిని సోమవారం ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
అయితే ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చే పరిహారం పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించడంతో ఆందోళనకారుల్లో విబేధాలు పొడసూపాయి. ఇటీవల గవాన్కర్తో భేటీ అనంతరం రాణే మాట్లాడుతూ ఉద్యమకారులు సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారని, ప్లాంటు పనులు కొనసాగుతాయని చెప్పారు. కొత్త పునరావాస పథకం ప్రకారం.. ప్రాజెక్టు కోసం సేకరించే ఒక్కో హెక్టారుకు రూ.22.5 లక్షలు చెల్లిస్తారు. గతంలో కేవలం రూ.లక్ష నుంచి రూ.4.5 లక్షల వరకు ఉండేది. ఇక ప్లాంటుకు రియాక్టర్లను సరఫరా చేయడానికి ఫ్రెంచ్ కంపెనీ అరెవా, కేంద్ర అణువిద్యుత్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలిసిందే.