సమ్మె యోచన వద్దు...
బ్యాంకు ఉద్యోగులకు జైట్లీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సమ్మె యోచనను విరమించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బ్యాంక్ ఉద్యోగులకు శనివారం విజ్ఞప్తి చేశారు. వేతన సవరణ డిమాండ్ పరిష్కారం కోసం ఈ నెల 25 నుంచీ 4 రోజుల పాటు సమ్మె బాట పట్టనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. సమస్యలపై చర్చల ప్రక్రియ నేపథ్యంలో సమ్మె యోచన సరికాదని జైట్లీ పేర్కొన్నట్లు ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్థికమంత్రిత్వశాఖ పేర్కొంది.
ఈ నెల 23వ తేదీన ముంబైలో సమస్య పరిష్కారం దిశలో సంబంధిత వర్గాలు చర్చలు జరుగుతున్న విషయాన్ని జైట్లీ ప్రస్తావిస్తూ, సమస్య పరిష్కారానికి చర్చలే సరైన మార్గమని పేర్కొన్నట్లు ప్రకటన తెలిపింది.
‘సేవల్లో’ సంస్కరణలు అవసరం: నిర్మలా సీతారామన్
కాగా, సేవల రంగంలో సంస్కరణలు అవసరమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రంగంలో ఉన్న పలు అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్లమెంటు సంప్రదింపుల కమిటీ సమావేశంలో నిర్మలా సీతారామన్ చేసిన సూచనలపై శనివారం ఇక్కడ వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. దేశంలో సేవల రంగం ఎగుమతులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీతారామన్ అన్నారు. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిందనీ, వీటి పరిష్కారంపై దృష్టి సారించనున్నదని పేర్కొన్నారు.