ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు.. మూసీ సుందరీకరణ లక్ష్యం ఏమిటి?
రాజకీయ రంగస్థలంపై మూసీ ప్రక్షాళన, పారదర్శకత లోపించి తీవ్ర వివాదాస్పద మవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్ల కూల్చివేతకు సంబంధించి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అగ్రహం ప్రకటించింది. ‘రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏమిటని, ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడుతారని, రాజకీయ భాష్యాలు చెప్పినట్లు చేస్తే జైళ్లకు పంపు తామ’ని హెచ్చరించింది. పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారనీ, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారనీ. ప్రభుత్వంపై, కమిషనర్ రంగనాథ్‌పై, అమీన్పూర్ తహసిల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ ఆక్రమణల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్.టి.ఎల్. నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్.టి.ఎల్ బయట ఇల్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించింది.‘అసలు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట జరుగుతున్న సుందరీకరణ లక్ష్యం ఏమిటి? మూసీ నదిని, ఆ నదిలో కలిసే వాగులను (గృహ, హోటల్, వ్యాపార, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, మురుగునీటిని) పూర్తి (ఐరోపా ప్రమాణాల) స్థాయిలో ప్రక్షాళన (శుద్ధి) చేసి స్వచ్ఛమైన జలాలు (నది)గా మార్చే లక్ష్యం ఏమైనా ఉందా? ప్రాజెక్టు పూర్తి అయితే, అంటే ఆ మురుగు నీటిని మూసీ నదిలో కలిసే నాటికి పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే ప్రక్రియ ఇందులో ఉందా? లేదా హైదరాబాద్ జంట నగరాలలోని మురుగు నీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదిలేసి ఆ మురుగు నీటి ప్రవాహంపైనే, సుందరీకరణ చేపడతారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. సమగ్రమైన ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్)ను ప్రజల ముందు ఉంచాలి. ప్రజల నివాసాలకు నష్టం కలిగే ఏ ప్రాజెక్టులో నైనా ముందు పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తయిన తరువాతనే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వారి నివాసాలను చివరలో ఖాళీ చేయించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. కానీ, అందుకు భిన్నంగా సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు జీవితమంతా కష్టించి నిర్మించుకున్న ఇండ్లను ప్రాజెక్టు ప్రారంభంలోనే ఎందుకు కూల్చుతున్నారు? ఇదేనా కేసీఆర్ విధానాలకు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యం?సామాన్య, మధ్యతరగతి వారికి ఒక ఇల్లు అనేది వారి మొత్తం జీవితపు కల. ఆ కల నిజం చేసుకోవడానికి జీవితంలో చాలా మూల్యం చెల్లిస్తారు. పట్టణంలో ఇల్లనే కల సాకారం కోసం సొంత ఊళ్ళలో ఉన్న పొలాలను, ఇతర ఆస్తులను అమ్ముతారు. అప్పులు తెస్తారు. అనేక కష్టాలతో వారి స్తోమతకు తగ్గ ఇల్లు నిర్మించుకుంటారు. ప్రాజెక్టు పేరుతో, పునరావాసం, ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ప్రభుత్వాల, పెద్దల రియల్ ఎస్టేట్ దందాతో 10, 20 గజాల నేలపై ఇల్లు కట్టుకోవడం సామాన్య మధ్య తరగతికి ఒక గగన కుసుమంగా మారింది. అందుకే వీరు మురికి వాడలకు, దుర్గంధ నదుల పరివాహ ప్రాంతాలకు తరలు తున్నారు. చౌకగా వస్తుందని దుర్గంధపూరిత నది అంచునే స్థలం కొని, భారీ డబ్బుతో క్రమబద్ధీకరణ చేసుకొని, ఇండ్లు నిర్మించుకున్నారు. కూల్చివేతల భయంతో గుండె పోటు చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. 8 నెలల నిండు గర్భిణీ అనే కనికరం లేకుండా ఆమె ఇల్లు కూల్చడం దుర్మార్గం. ఒక బాధిత కుటుంబం 25 ఏళ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటూ నలుగురు కొడు కులకు పెళ్లి చేసింది. నిర్వాసితులైన వీరందరికీ ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లభించింది. ఒక్క ఇంట్లో ఇన్ని కుటుంబాలు ఎలా నివసించాలని వేదనకు గురవుతున్నారు వారు. హైడ్రాతో ప్రభుత్వానికి వచ్చిన కీర్తి, మూసి పేదల ఇళ్ల కూల్చివేతతో పాతాళంలోకి పోయింది.జల వనరులను, ప్రభుత్వ స్థలాలను, పార్కులను రక్షించవలసిందే. కానీ వాటిని ఆక్రమించి భారీ ఆస్తులుగా చేసుకున్నది సామాన్య పౌరులు కాదు. అధికారంలో ఉన్న బడాబాబులు, పెద్దలే. మూసీ నదీ గర్భంలో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపినా, మరికొందరు ఇండ్లను వదిలిపెట్టడానికి ససేమిరా సిద్ధంగా లేరు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆశించిన స్థానిక ప్రజలు వాటిని తమకే కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. మూసి నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ సమీప ప్రజల మధ్య ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించి దాదాపు 15 వేల కుటుంబ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని 2022లోనే నిర్ణయించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంలో పది వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. ఆ నిర్వాసి తులందరికీ వారి నివాసానికి, ఉపాధికి అనువైన చోట అన్ని మౌలిక వసతులతో కూడిన పునరావాస సౌకర్యాలను ప్రభుత్వం నిర్వాసితులకు కల్పించాలి. దౌర్జన్యంతో కాకుండా నిర్వాసితులను అన్ని విధాల ఒప్పించి మెప్పించి పునరావస కాలనీకి తరలించాలి.చదవండి: రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చాలి!శుద్ధీకరణ అంటే, మురుగు నీటిలో ఉన్న అశుద్ధ మూలకాలను, కాలుష్యాన్ని తొలగించడం. శుద్ధి చేసిన తర్వాత ఆ నీరు త్రాగడానికి అనువైన విధంగా 100% సురక్షితంగా ఉండాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజె క్టులో నేటి ప్రభుత్వం ఆ నది మురుగు జలాలను అలా స్వచ్ఛమైన తాగునీరుగా మారుస్తుందా? దేశంలోని చాలా నగరాల్లో మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఎక్కడా మురుగు నీటిని స్వచ్ఛ జలాలుగా మార్చిన చరిత్ర నేటికీ లేనేలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో అంగీకరించారు. సీవరేస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ల ద్వారా మురుగునీటి శుద్ధీకరణ 30–35% కంటే మించదనీ, తెలంగాణలోలోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ పథకానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టనీ, మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అనీ రకరకాల పేర్లతో మంత్రులు, అధికారులే గందరగోళం చేస్తున్నారు. మూíసీ నదిని పూర్తి స్థాయిలో ఒక ఎకలాజికల్ ప్రాజెక్టు (ఒక స్వచ్ఛమైన నది)గా తీర్చి దిద్దాలనే లక్ష్యం ఏమైనా ప్రభుత్వానికి ఉందా?చదవండి: ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ఒక మేన్యువల్‌ను 1997లో ప్రకటించింది. ‘డిజైన్ మేన్యువల్ ఫర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఇన్ ఇండియా’ (దేశంలోని వ్యర్థాల స్థిరీకరణ చెరువుల కోసం డిజైన్ మాన్యువల్). ఇది ప్రకటించి 27 ఏళ్ల అయింది. దీని అర్థం ఏమిటంటే... మురుగు నీటిని శుద్ధి చేయలేమని చేతులెత్తేసి, ఆ నీటిని తాగునీరులో కలవకుండా మురుగునీటిని కుంటలుగా స్థిరపరుస్తామని చెప్పడం. కోటిమంది హైదరాబాద్ నగర వాసులు వాడిన మురికి నీరు, వ్యాపార సముదాయాల వ్యర్థాలు, పరిశ్ర మలు వెదజల్లే విష పదార్థాలు మూసీ ద్వారా కృష్ణా నదిలో యధేచ్ఛగా కలుస్తున్నాయి. ఆ కలుషిత నీటినే ప్రజలు జీవజలంగా సేవిస్తున్నారు. మురుగు నీటి శుద్ధీకరణ పథ కాలకు ఎంత అందమైన పేర్లు పెట్టినా శుద్ధీకరణ వట్టిదే నని 75 ఏళ్ల దేశ చరిత్ర రుజువు చేస్తోంది. ఇది కఠిన వాస్తవం. మరి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ లిమిటెడ్ ప్రక్షాళన ఏ రకమైనదో... డీపీఆర్‌ను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి.- నైనాల గోవర్ధన్ తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్