జలయజ్ఞం పనులకు కొత్త టెండర్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో జరుగుతున్న జలయజ్ఞం ప్రాజెక్టుల టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఛాంబర్లో శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కోండ్రు మురళీమోహన్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులు వేగంగా జరగాలంటే ప్రస్తుతం అర్ధాంతరంగా నిలిపివేసిన కాంట్రాక్టర్లను తొల గించి, కొత్తవారికి అప్పగించాలని పలువురు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కోండ్రు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించారని తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో జలయజ్ఞం కింద పలు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అందులో వంశధార కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ ముఖ్యమైనది.
ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు మధ్యలోనే వాటిని నిలిపివేశారు. వంశధార 87, 88 ప్యాకేజీలకు సంబంధించి కోర్టు కేసులు ఉండటంతో సుమారు ఐదేళ్లుగా పనులు ఆగిపోయాయి. ఇప్పటి వరకు 30 శాతం పనులు మాత్రమే జరిగాయి. దీంతో అంచనా వ్యయం కూడా దాదాపు రెట్టింపయ్యే అవకాశమున్నందున పాత అంచనాల ప్రకారం పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. అందువల్ల ఈ రెండు ప్యాకేజీలను రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని ఇరిగేషన్ మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. వంశధార, నాగావళి వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన కరకట్టల నిర్మాణాల్లో 1, 2, 3 ప్యాకేజీల పనులు కూడా నిలిచిపోయాయి. కొత్త అంచనాలతో టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు.
నారాయణపురం ఆధునికీకరణతోపాటు ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు సైతం కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కాగా 2009లో ప్రభుత్వం తోటపల్లి విస్తరణ ప్రాజెక్టుకు రూ.138 కోట్లు మంజూరు చేసింది. దీనికి అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య పాలకొండ సమీపంలోని నవగాం వద్ద శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఈ పనులు కూడా ముందుకు సాగనందున పాత కాంట్రాక్టులు రద్దు చేసి, కొత్త వారికి అప్పగించాలని, పనులు వెంటనే చేపట్టాలని ఈ సమావేశంలో అధికారులను ఆదేశించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ 61 ప్రకారం కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాన్ని రికవరీ పెట్టి కొత్తగా టెండర్లు పిలవడం ద్వారా పనులు వేగవంతం చేయాలని మంత్రులు సుదర్శన్‌రెడ్డి, కోండ్రు మురళీమోహన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ కార్యదర్శులు ఆదిత్యనాథ్, అరవిందరెడ్డి, ఈఎన్సీ మురళీధర్, నారాయణరెడ్డి, ఎం వెంకటేశ్వరావు, నార్త్ కోస్ట్ ప్రాజెక్ట్స్ సీఈ జలంధర్, వంశధార ప్రాజెక్ట్ ఎస్ఈ రాంబాబులు పాల్గొన్నారు.