కడిగి ముగ్గేసింది...
ఊరి తీరు మార్చింది...
కులాల గొడవలేని... మతాల మాటలేని...
పార్టీల పట్టింపుల్లేని... ఊరుంటుందా?
మద్యం తాగని మనిషే లేని ఊరు ఉంటుందా?
సినిమా నటుల మీద అభిమానంతో
సంఘాలు పెట్టని యువకులు ఉన్న ఊరు ఉంటుందా?
ఉంటుంది!
తమిళనాడు, తిరునల్వేలి జిల్లాలోని జమీన్‌దేవరకుళం...
అలాంటి ఊరే.
ఆ ఊరిని ఇంత ఆదర్శగ్రామంగా మలిచిన ఓ మహిళ
పోరాట పటిమే... ఈ స్టోరీ.
మదురైకి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊళ్లోకి ప్రవేశించగానే తెలిసిపోతుంది దీని ప్రత్యేకత! రోడ్డుకి రెండువైపులా ఉన్న ఎత్తయిన చెట్లు ఆ ఊరి ప్రజల పర్యావరణ పరిరక్షణ స్పృహకు ప్రతీకలుగా కనిపిస్తాయి. చక్కటి స్కూలు, పిల్లలు ఆడుకోవడానికి విశాలమైన మైదానాలు, పెద్దలు సేదతీరడానికి ఉద్యానవనాలతో ఊరంతా పచ్చగా ఉంటుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏ మూల తిరిగినా ఏదో ఒకపనిలో నిమగ్నమైన జనాలతో చురుగ్గా దర్శనమిస్తుంది.
దాదాపు పదిహేనువందల జనాభా కలిగిన జమీన్‌దేవరకుళం నాలుగేళ్ల కిందట మరోలా ఉండేది. మందుకు బానిసలై.. భార్యలను హింసిస్తూ సోమరిగా తిరిగే మగవాళ్లు, కుటుంబ భారాన్ని మోస్తూ ఆడవాళ్లు, కులాల కొట్లాటలు, అంటరానితనం, పార్టీ పంచాయితీలతో మోతుబరులు... చదువుల్లేక వీధుల్లో కాలక్షేపం చేస్తూ ఆడపిల్లలను ఏడిపిస్తూ యూత్ మొత్తానికి జమీన్‌దేవరకుళం అంటేనే తగాదాలు, తెంపుల గ్రామం అన్నట్టు ఉండేది. కనీస వసతులకు కోసుల దూరంలో ఉండేది.
సీన్ మారిపోయింది
ఈ సీన్‌ను పూర్తిగా మార్చేసింది ఓ స్త్రీ శక్తి! పేరు కమల. వయసు.. 27 ఏళ్లు! అయితే ఈ మార్పు తేవడం ఆమెకంత ఆషామాషీ వ్యవహారమేం కాలేదు. అసలు ఊరిని మార్చడానికి ఆవిడ ఎవరు? ఆమెకున్న అర్హత ఏంటి? అన్న ప్రశ్నలు ఆమె ఆశయం కార్యరూపం దాల్చకుండా అడ్డుపడ్డాయి. ‘‘నా ఊరి క్షేమం కాంక్షించాలన్నా, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలన్నా ఈ గ్రామ పౌరురాలిగా బాధ్యత మాత్రమే సరిపోదేమో.. అంతకుమించిన అధికార అర్హత కావాలేమో’ అని ఓ నిశ్చయానికి వచ్చారు కమల. 2011లో జమీన్‌దేవరకుళం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. అయితే అగ్రకుల పెద్దలు, రాజకీయ వృద్ధులు కమలను వ్యతిరేకించారు. ‘ఒక మహిళ, అందునా రాజకీయాలు ఏమాత్రం తెలియని చిన్న పిల్ల సర్పంచ్ అయి ఊరినేం ఉద్ధరిస్తుంది?’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రచారం చేయనివ్వకుండా ఆటంకాలు సృష్టించారు. ఆ మాటలకు చేతలతోనే సమాధానం ఇవ్వాలి అనుకున్నారు కమల. తన ప్రచారానికి యువతను, స్త్రీలను లక్ష్యంగా ఎంచుకున్నారు.
గల్ఫ్‌లో ఉన్న యూత్‌తో
ఊరి పరిస్థితులతో విసిగి వేసారి మదురై వెళ్లిపోయి పై చదువులు చదివి, గల్ఫ్‌లో ఇంజనీర్లుగా, ఇతర రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డవాళ్లను ఫోన్లో సంప్రదించారు కమల. జమీన్‌దేవరకుళం ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న విషయాన్ని చెప్పి ఒకవేళ తాను గెలిస్తే ఊరి బాగుకోసం ఎలాంటి సహాయం చేయగలరో అడిగారు. ఊరి అభివృద్ధికి వాళ్ల దగ్గర ఏమన్నా ఆలోచనలు, ప్రణాళికలు ఉంటే పంచుకొమ్మని కోరారు. గల్ఫ్‌లో ఉన్న దేవరకుళం గ్రామస్తులు తమ ఆడబిడ్డ ఆరాటం చూసి ముచ్చటపడ్డారు. ఊరిబాగు కోసం ఆమె పడ్తున్న తపన వాళ్లలోనూ కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
గెలిచారు...
చిత్తశుద్ధికి ఓటమి ఉండదంటారు. అన్నట్టుగానే ఆ ఎన్నికల్లో గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా కమల గెలిచారు. గెలిచిన వెంటనే తన ఎజెండాలో ఉన్న మొదటి పనిగా.. ఊర్లో ఉన్న నీటి ఎద్దడిని తీర్చే ప్రయత్నంలో పడ్డారు. 60 వేల, పదివేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న రెండు వాటర్‌ట్యాంక్‌లను కట్టించారు. తర్వాత.. పనుల మీద జమీన్దేవరకుళంకు వచ్చేవారికోసం అయిదు షవర్స్‌తో పబ్లిక్ టాయ్‌లెట్స్‌ని నిర్మించారు. దళిత వాడల్లోని ప్రతి ఇంటికీ టాయ్‌లెట్స్‌ని కట్టించి ఇచ్చారు. దళిత ఆడపిల్లలు స్కూల్లో చేరేలా ప్రోత్సహించారు. ప్రతి వారం ఊళ్లోని వాళ్లంతా దళిత వాడలో సహపంక్తి భోజనాలు చేసే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఊరి పండగలను దళితుల చేతులమీదుగా జరిపించే ఆచారాన్నీ మొదలుపెట్టారు. అయితే ఈ పనులను మొదట్లో అగ్రకులాల వాళ్లు అడ్డుకున్నారు. కమల మీద దాడులు కూడా చేశారు. అయినా కమల వెరువలేదు.. బెదరలేదు. ఈ విషయం తెలిసి గల్ఫ్‌లో ఉన్న జమీన్‌దేవరకుళం గ్రామస్తులు ఓ ఇరవైమంది ఉన్నపళంగా ఆ ఊరికి బయలుదేరారు. అందులో అగ్రకులాల వాళ్లూ ఉన్నారు. వాళ్ల పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ‘‘మీకు మంచి చేయడం రాకపోతే చేస్తున్నవాళ్లకు అండగా ఉండండి’’ అని బతిమాలారు. వాళ్ల తీరు మారకపోతే పేగుబంధాన్ని, బంధుత్వాన్నీ తెంచుకుంటామని హెచ్చరించారు. బతిమిలాడితే కరిగిపోయారో.. హెచ్చరికకు భయపడ్డారో కానీ పెద్దాళ్ల పద్ధతి మారింది. కమలకు మద్దతునివ్వడం మొదలైంది. అంతకు మందు ఆ ఊరి స్త్రీలకు పెద్ద శాపంగా ఉన్న మందూ ఇప్పుడు బంద్. ఆ ఊళ్లోనే కాదు ఆ ఊరి స్ఫూర్తితో చుట్టుపక్కల ఊళ్లోనూ మద్యం దుకాణాలను మూసేయించారు జనాలు. విజయా బ్యాంక్ బ్రాంచినే, ఏటీఎమ్ సెంటర్‌నూ ఏర్పాటు చేయించారు.
ఇప్పుడు..
జమీన్‌దేవరకుళం ఆదర్శమైన గ్రామం. ఇదంతా ఓ ఆడబిడ్డ పుణ్యం. ‘‘ఈ ప్రయాణంలో నా భర్త బాలకృష్ణన్ సహకారం ఎంతో ఉంది’’ అని చెప్తారు కమల. ఈ ఇద్దరూ కాలేజ్ డ్రాపవుట్స్.
‘‘చూస్తుండగానే నా పదవీకాలం దగ్గరకొచ్చేసింది. చేయాల్సినవి ఇంకా చాలా మిగిలాయి. ఈ యేడాదిలో వాటిలో కనీసం కొన్నయినా పూర్తిచేయాలి. ముఖ్యంగా మా ఊరి మహిళల కోసం కుటీరపరిశ్రమల ఏర్పాటుచేయాలి. వాళ్లకు చేతినిండా పని కల్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలి. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అదే’’ అంటున్నారు కమల. తర్వాత ఎన్నికల్లో కూడా నిలబడ్తారా అని అడిగితే.. ‘‘లేదు.. కొత్త వాళ్లకు అవకాశం రావాలి. వాళ్ల ఆలోచనలు, ప్రతిభా ఊరికి ఉపయోగపడాలి. పదవి లేకపోయినా నా ప్రయత్నాలు ఆగవు’’ అని కమల స్థిర నిశ్చయంతో చెప్పారు.
ప్రాక్టికల్‌గా చేసి చూపించారు
పంచాయితీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకే ఊరంతటిని ఒక్కటిగా చేశారు కమల. ఐకమత్యంగా ఉంటే ఆ ఊరికి ఎంత బలమో ప్రాక్టికల్‌గా చూపించారు. ఆ ఊరి పీడ అయిన అంటరాని తనాన్ని పూర్తిగా రూపుమాపడం కోసం కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. ఇప్పటి వరకు ఆరు కులాంతర వివాహాలను జరిపించారు. స్త్రీలకు, యువతకు ప్రభుత్వ స్కీముల ద్వారా ఉద్యోగాలు ఇప్పించారు. ఊళ్లో పదహారు చోట్ల మైకులను పెట్టించారు. ప్రతివారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి, వాటి ఉపయోగాల గురించి, రాష్ట్ర, దేశ రాజకీయాల పరిణామాల గురించి పంచాయితీ వార్డ్మెంబర్స్ ఆ మైకుల ద్వారా ఊరంతటికీ సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. అంతేకాదు పంచాయితీ తలపెట్టదల్చిన కొత్త పనుల గురించి, వర్క్ షెడ్యూల్స్ గురించిన వివరమూ చెప్తుంటారు. అలాగే గంట గంటకు టైమ్ తెలిపేలా పంచాయితీ ప్రాంగణంలో టాకింగ్ క్లాక్నూ అమర్చారు. ఓ సామెత, మంచిమాటతో గంట గంటకు సమయాన్ని చెప్తుంటుందీ టాకింగ్ క్లాక్. వీటితో ఆగలేదు ఆమె. దేవరకుళం ఆడపిల్లలు నిర్భయంగా బయటకు వెళ్లగలిగినప్పుడే ఆ ఊరికి గౌరవం ఉన్నట్లు అని భావించారు. అందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఆడపిల్లల్ని వేధించకుండా, వీధుల్లో దొంగతనాలు జరగకుండా ప్రతి వీధికి సీసీకెమెరాలను ఏర్పాటు చేయించారు కమల. ఈ సీసీకెమెరాల ఏర్పాటు తర్వాత ఊళ్లో క్రైమ్ రేట్, ఈవ్ టీజింగ్ గణనీయంగా తగ్గిపోయిందని చెప్తారు పోలీసులు, గ్రామస్తులు కూడా.