సమాచార హక్కు బేఖాతరు
ఏళ్లు గడుస్తున్నా పట్టింపులేదు
జమ్మికుంటరూరల్: సమాచార హక్కు చట్టం నియమనింబధనల మేరకు 30 రోజుల్లోపు సంబంధిత అధికారులు పూర్తి సమాచారాన్ని దరఖాస్తుదారునికి అందించాలి. కానీ.. జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయంలో మాత్రం అవేమి కనిపించడం లేదు. కొందరు దరఖాస్తుదారులు సమాచారం కోసం దరఖాస్తులు చేసి ఏళ్లు గడుస్తున్నా.. అధికారులు తగిన సమాచారాన్ని ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. సహ చట్టం కార్యకర్తలు, యువకులు, ప్రజాప్రతినిధులు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరితే ఏదో ఒక సాకుతో దాటవేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ దొగ్గల ప్రకాష్ నాలుగు నెలల క్రితం ఎంపీడీవో రమేష్ రూట్డైరీ వివరాలు..? సర్పంచ్లు, ఎంపీటీసీలు గెలిచినప్పటినుంచి ఇప్పటివరకు ఎంతమంది.. ఎన్నిసార్లు సమావేశాలకు హాజరయ్యారు..? సర్వసభ్య సమావేశాలకు ఎంతమంది అధికారులు గైర్హాజరు అయ్యారు..? ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు..? ప్రజాప్రతినిధులు, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు అధికారులు తీసుకున్న చర్యల వివరాలు కోరారు. అయితే నెలలు గడుస్తున్నా.. ఇంకా ఇవ్వడం లేదని ప్రకాశ్ పేర్కొన్నారు. కొన్నేళ్లక్రితం మండలంలోని పలు గ్రామాలలో సర్పంచ్లు ఎన్నిక అయిన నాటి నుండి 14వ, ఆర్థిక సంఘం నిధులు, టీఎఫ్సీ, ఎస్ఎఫ్సీ, బీఆర్జీఎఫ్, ఆదాయ, వ్యయాలను కోరగా కొన్ని గ్రామాలకు మాత్రమే ఇచ్చినట్లు రాంరాజయ్య తెలిపారు.
వైరమణారెడ్డి అనే పంచాయతీ కార్యదర్శి జమ్మికుంట మండలంలో ఎక్కడెక్కడ పనిచేశాడు..? ఇన్చార్జిగా ఎక్కడెకక్కడ వ్యవహరించాడు..? ఇతనిపై వచ్చిన ఫిర్యాదులపై ఏమేమీ చర్యలు తీసుకున్నారు..? అనే వివరాలు కోరగా రికార్డులు అందుబాటులో లేవని ఎంపీడీవో వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని వివరాలను అధికారులు ఇవ్వకపోవడంతో ప్రకాష్ అధికారుల తీరుపై సమాచార హక్కు చట్టం కమీషనర్ హైదరాబాద్లో ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే అడిగిన సమాచారం ఇవ్వడం లేదని పేర్కొంటూ ప్రకాశ్ హైదరాబాద్ కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.