ఎలుకల దాడిలో మరో పసికందు బలి
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందుపై ఎలుకల దాడి ఉదంతం గుర్తుండే ఉంటుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఎలుకల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటన తీవ్ర సంచలనం రేగింది. ఇప్పుడు మళ్లీ అదేమాదిరి విచారకర సంఘటన జమ్మూకశ్మీర్లోని కిశ్వత్వార్ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను రాక్కాసి ఎలుకలు కాటేశాయి. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూలోని మారుమూల ప్రాంతమైన చత్రూ ప్రాంతానికి చెందిన గులామ్ హస్సాన్ తన భార్యను ప్రసవానికి ప్రభుత్వానికి తీసుకునివచ్చాడు. ఆమె గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారిని వైద్యచికిత్స నిమిత్తం మెటర్నిటీ వార్డుకు తరలించారు.
శనివారం బాబును చూద్దామని వెళ్లిన తండ్రి హస్సాన్కు ఎలుకల దాడిలో తీవ్రంగా గాయపడిన బాబు కనిపించాడు. బాబు శరీరమంతా తీవ్ర రక్తపుస్రావమై ఉంది. కంగారు పడిన హస్సాన్ వెంటనే అక్కడి వైద్యులకు సమాచారమిచ్చాడు. అయితే ఆ బాబు అప్పటికే మరణించాడని వైద్యులు గుర్తించారు. హస్సాన్ వెళ్లిన సమయానికి కూడా బాబును ఎలుకలు కొరుకుతూనే ఉన్నాయని జమ్మూ హైల్త్ సర్వీసెస్ డైరెక్టర్ గుర్జిత్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ దీనిపై విచారణ చేస్తారని ఆయన చెప్పారు. బేబీ అప్పటికే కొన్ని ఆరోగ్యసమస్యలతో జన్మించాడని, ఎలుకలు కొరకడంతో వెంటనే మరణించినట్టు భావిస్తున్నట్టు పేర్కొన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరైనా తప్పుచేసినట్టు విచారణలో వెల్లడైతే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.