దేశ భద్రతకు చైనా సవాళ్లు
జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ ఎస్కే సిన్హా
సాక్షి, హైదరాబాద్: భారత్‌ను అన్ని రంగాల్లో చైనా చిదిమేస్తోందని జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ ఎస్కే సిన్హా అభిప్రాయపడ్డారు. దేశంలో రాజకీయ కృతనిశ్చయం లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. భారత్ చుట్టూ ఉన్న వివిధ దేశాల్లో చైనా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుందన్నారు. ఇది దేశ భద్రతకు పెనుసవాలుగా మారనుందని అభిప్రాయపడ్డారు. ప్రజ్ఞా భారతి, సోషల్ కన్సర్న్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ‘భారతదేశ భద్రత - దృక్పథం’ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడంతో నక్సలైట్లు రెచ్చిపోతున్నారన్నారు. దేశదీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా కృతనిశ్చయంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
హక్కుల నేతల్ని నిర్మూలిస్తేనే..
నక్సలైట్ ఉద్యమానికి డబ్బులు అందిస్తున్న కొన్ని రాజకీయపార్టీల వల్లే ఆ ఉద్యమం కొనసాగుతోందని టి. హనుమాన్ చౌదరి అభిప్రాయపడ్డారు. నక్సలైటు ఉద్యమానికి మద్దతు బయటి నుంచి.. ప్రధానంగా మానవ హక్కుల సంఘాల నుంచి లభిస్తోందన్నారు. వరవరరావు, గద్దర్, అరుంధతీరాయ్ లాంటి వారిని అణచి వేయకుండా నక్సలైటు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.