కశ్మీర్లో ముదిరిన సంక్షోభం
ఆపద్ధర్మ సీఎంగా కొనసాగబోనని స్పష్టం చేసిన ఒమర్
కేంద్రానికి నివేదిక పంపిన గవర్నర్
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనంటూ ఒమర్ అబ్దుల్లా గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు స్పష్టంచేశారు. దీంతో గవర్నర్ రాష్ట్రంలో తాజా పరిస్థితిని తెలియజేస్తూ గురువారం కేంద్రానికి నివేదిక పంపారు. దీన్ని హోం మంత్రి రాజ్నాథ్ ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపారు. ఇప్పటిదాకా ఏ పార్టీ/కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేశారు.
10 రోజులే అన్నారు.. ఒమర్: లండన్ నుంచి బుధవారమే తిరిగొచ్చిన ఒమర్ ఢిల్లీలో గవర్నర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆపద్ధర్మ సీఎం పదవి నుంచి తప్పుకుంటానని గవర్నర్కు చెప్పారు. సరిహద్దులో తాజా పరిస్థితులతోపాటు వరద బాధితులకు సాయం అందించాల్సి ఉన్నందున రాష్ట్రానికి పూర్తిస్థాయి ముఖ్యమంత్రి ఉండాలని వివరించారు. ఇవే విషయాలను గురువారం ట్వీటర్లో వివరించారు. ‘‘పది రోజుల్లోగా ప్రభుత్వం ఏర్పడుతుందన్న హామీపై నేను ఆపద్ధర్మ సీఎంగా పగ్గాలు చేపట్టాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశాలున్నాయి.
సరిహద్దుల్లో 10 వేల మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులకు సాయం అందాల్సి ఉంది. పూర్తిస్థాయి సీఎం ఉంటేనే వీటన్నింటికీ పరిష్కారం చూపడం సాధ్యమవుతుంది’’ అని పేర్కొన్నారు. 28 సీట్లలో నెగ్గి, రెండు పార్టీలు(ఎన్సీ, కాంగ్రెస్) మద్దతిస్తామని చెబుతున్నా పీడీపీ ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. డిసెంబర్ 24న రాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 19నాటికి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన తప్పదు.