ఇదీ ..జన ‘చైతన్యం’
– పెంచికలపాడులో ఎమ్మెల్యే మణిగాంధీకి చుక్కెదురు
– నగరూరులో జెండాను ఆవిష్కరించి వెనుదిరిగిన జెడ్పీటీసీ
– నంద్యాలలో భూమా, శిల్పా వేర్వేరు యాత్రలు
– వెల్దుర్తి మండలంలో ప్రజల నిలదీత
కర్నూలు(అర్బన్): జనంలో చైతన్యం వచ్చింది .. చైతన్య యాత్రల పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న టీడీపీ నాయకులను అడుగడుగునా నిలదీస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీంతో సభలను వాయిదా వేసుకొని టీడీపీ నేతలు వెనుదిరుగుతున్నారు. ఇటీవలి కాలంలో అనేక మంది వృద్ధుళ/, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు నిలిచిపోయాయి. దీంతో బాధితులు టీడీపీ నాయకులను చుట్టుముట్టి ప్రశ్నల వర్శం కురిపిస్తున్నారు. బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.
– కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం పెంచికలపాడు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మణిగాంధీని ఎస్సీ కాలనీ ప్రజలు నిలదీశారు. మంచి నీటి సమస్యకు పరిష్కారం చూపాలని పట్టుబట్టారు. గుడిపాడు గ్రామంలో కూడా ఎస్సీ కాలనీకి కొత్త తాగునీటి పైప్‌లైన్ వేయాలని, సీసీ రోడ్డు, డ్రైనేజీ, ఉన్నత పాఠశాలకు ప్రహరీగోడ నిర్మించాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా, ప్రజలు వినిపించుకోలేదు.
– సి. బెళగల్ మండలం ముడుమాల గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వీరు కూడా పెన్షన్ల కోసం స్థానిక నేతలను నిలదీశారు. కొండాపురం గ్రామంలో జరిగిన సభకు ప్రజలెవ్వరు హాజరు కాకపోవడంతో నేతలు సభను ఉదయం వాయిదా వేసుకున్నారు.
– ఆస్పరి మండలం నగరూరు గ్రామంలో జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ సభకు జనం లేకపోవడంతో కేవలం పార్టీ జెండాను ఆవిష్కరించి వెనుదిరిగారు.
– నంద్యాల నియోజకవర్గంలో శిల్పా, భూమా వర్గాలు వేర్వేరుగా జనచైతన్య యాత్రలను చేపట్టడంతో కార్యకర్తలు ఎక్కడ హాజరు కావాలో తేల్చుకోలేక అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యే భూమా యాళ్లూరు మండలంలో చేపట్టగా, శిల్పా గోస్పాడు మండలంలో చైతన్యయాత్రల్లో పాల్గొన్నారు.
– వెల్దుర్తి మండలం సర్పరాజపురం, నరసాపురం, ఎల్ తాండాల్లో జరిగిన జనచైతన్య యాత్రలు జనం లేక బోసి పోయాయి. హాజరైన కొద్ది మంది కూడా రేషన్‌కార్డులు, పెన్షన్లపై నిలదీశారు.
– శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంటలో జరిగిన చైతన్యయాత్రకు స్పందన కరువైంది.