సస్పెన్షన్‌లో ఉన్నా సొంతూరులో పోస్టింగ్
మునిసిపల్ అధికారుల నిర్వాకం
ఆర్డీ ఆదేశాల మేరకే అంటున్న కమిషనర్
జనగామ : ‘అవినీతిని సహించేది లేదు. ఎంతటివారినైనా శిక్షిస్తాం’ అంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా డిప్యూటీ సీఎంనే తప్పించి అన్నంత పని చేసింది.. అయితే ఈ నియమాలు మాకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మునిసిపాలిటీ ఉన్నతాధికారులు. ఇందుకు జనగామ మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టిన తాటి బిక్షపతి ఉదంతం తాజా ఉదాహరణగా నిలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన తాటి బిక్షపతి గతంలో జనగామ మునిసిపాలిటీలో పనిచేసేవారు. కాగా ప్రత్యేక అధికారుల పాలనలో మునిసిపాలిటీలోని పలు అవినీతి ఆరోపణలపై 2012లో లోకాయుక్తకు ఫిర్యాదులు అందాయి. మునిసిపల్ ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇక్కడి వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పరిశీలించిన అప్పటి ఏపీ ప్రభుత్వం జనగామ మునిసిపాలిటీలో పనిచేసిన నలుగురు కమిషనర్లకు, సుమారు ఎనిమిది మంది సిబ్బందికి 2014 జనవరి 10న చార్జ్ మెమోలను జారీ చేసింది.
వారిలో తాటి బిక్షపతి కూడా ఉన్నారు. అయితే ఈ ఉద్యోగిని అప్పటికే మహబూబాబాద్‌కు బదిలీ చేయగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఈయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనే అభియోగాలున్నాయి. ఏకంగా వివిధ సర్టిఫికెట్లపై కమిషనర్ సంతకం ఉండాల్సిన చోట తన సంతకం చేసి జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని ఉన్నతాధికారులు 2014 డిసెంబర్ 24న సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ వేటు పడి రెండు నెలలు గడవకముందే తన సొంతూరు జనగామలో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకోవడం చర్చనీయూంశంగా మారింది. ఈ విషయమై కమిషనర్ సత్యనారాయణను వివరణ కోరగా నియామకాలు ఆర్డీ పరిధిలో ఉంటాయని, తమ శాఖ ఆర్డీ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వుల మేరకు బిక్షపతిని విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతందని తెలిపారు.