మనకూ ఓ ‘జనాహార్’
తాటిచెట్లపాలెం: సగటు ప్రయాణికుడు రైల్వేస్టేషన్లో అల్పాహారం కొనుగోలు చేయాలంటే వెనుకడుగేస్తున్నాడు. విభిన్నరుచులను ఆస్వాదించాలంటే జేబులు ఖాళీఅయ్యే పరిస్థితే మరి.. ఈనేపథ్యంలో సుమారు 55 రుచికరమైన పదార్థాలను అతితక్కువ ధరకే అందించే విధంగా రైల్వేశాఖ రూపొందించిన ప్రణాళిక శ్రావణమాసపు రెండో వారంలో అమలులోకి తీసుకురానుంది.
‘జనాహార్’..కనిష్టంగా రూ.9 కే ఉడికిన గుడ్డు మొదలు గరిష్టంగా రూ.50 లో ఫిష్కర్రీ వరకూ విభిన్నరుచులతో ప్రయాణికులకు ఆయా పదార్థాలను అందుబాటులోకి తెస్తోంది. వాల్తేరుడివిజన్ పరిధిలో రైల్వేశాఖ రూ.3.83 కోట్లతో విశాఖరైల్వేస్టేషన్ ఒకటో నెంబరుప్లాట్ఫాంపై ఐఆర్సీటీసీ దీనిని ఏర్పాటుచేయనుంది. గతేడాది టెండర్ వేయగా, మెనూ అమలుతో పాటు స్టాఫ్రిక్రూట్మెంట్, టెండర్ అలాట్మెంట్, మానిటరింగ్, ఇన్స్పెక్షన్ , లైసెన్స్ ల జారీ తదితర విషయాల్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎలక్ట్రికల్ కనెక్షన్ మంజూరుచేయగా పనులు ఊపందుకున్నాయి. వాల్తేరుడివిజన్పరిధిలో తొలుతగా 2014 సెప్టెంబర్ లో శ్రీకాకుళం రోడ్డులో జనాహార్ను 5 సంవత్సరాల కాలవ్యవధితో రూ.60 లక్షలకు ఐఆర్సీటీసీ సొంతంచేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈనేపథ్యంలో నిత్యం 40వేల పైచిలుకు ప్రయాణికులు విశాఖ నుంచి రాకపోకలు సాగించడంతో జనాహార్ అవశ్యకతను గుర్తించిన రైల్వేశాఖ ఈ మేరకు త్వరిత గతిన పనులు పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేసింది.
ఆకర్షణీయంగా..ఆహ్లాదంగా..
పసుపు , ఆకుపచ్చ రంగులతో మిళితమై ఆకర్షణీయమైన డైనింగ్తో జనాహార్ స్వాగతిస్తుంది. తక్కువ ధరకే లగ్జరీ తరహాలో వీటిని తీర్చిదిద్దుతారు. ఒకేసారి నలుగురు కూర్చుని కుటుంబ సమేతంగా ఆహారాన్ని స్వీకరించే విధంగా టేబుల్డిజైన్ఉంటుంది.