జానంపేట ఘటనలో 60మందిపై కేసులు
అడ్డాకుల (మహబూబ్‌నగర్) : జానంపేట ఘటనలో రాళ్లు రువ్విన 60 మంది ఆందోళనకారులపై పోలీసులు మంగళవారం కేసులు పెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా జానంపేట వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో గ్రామస్తులు అర్ధరాత్రి వరకు ఆందోళన చేసిన విషయం విదితమే.
ఆందోళనకారులను చెదరగొట్టడానికి వనపర్తి డీఎస్పీ చెన్నయ్య, కొత్తకోట సీఐ కిషన్, అడ్డాకుల, భూత్పూర్ ఎస్‌లు క్శైవాస్, లక్ష్మారెడ్డి ప్రయత్నించగా ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగడంతో డీఎస్పీ, సీఐ, ఎస్ఐ లక్ష్మారెడ్డి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. డీఎస్పీ, కొత్తకోట ఎస్ఐల వాహనాలను గ్రామస్తులు ధ్వంసం చేశారు. ఎట్టకేలకు మహబూబ్‌నగర్ ఆర్డీవో హన్మంత్‌రెడ్డి ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో పాటు అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు ప్రత్యేక బలగాలను మోహరించడంతో అర్ధరాత్రి సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది.
నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఆందోళన కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో ట్రాఫిక్‌ను కొత్తకోట నుంచి వనపర్తి మీదుగా మళ్లించారు. గ్రామస్తుల దాడిలో గాయపడిన డీఎస్పీ చెన్నయ్యను అదే రోజు రాత్రి కొత్తకోటలో చికిత్స చేయించి కర్నూల్‌కు తీసుకెళ్లారు. మంగళవారం అక్కడ చికిత్స చేయించుకుని డిశ్చార్జి అయినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 60 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.శ్రీనివాస్ తెలిపారు.