లెక్కల్లేవ్!
♦ ఆస్పత్రి అభివృద్ధి నిధుల్లో అవకతవకలు
♦ జననీ సురక్ష యోజనలోనూ గందరగోళం
♦ ఖర్చు చేసిన నిధులకు లెక్క చూపని వైనం
♦ వివరాలు సమర్పించని పలు ఆస్పత్రులు
♦ తలపట్టుకుంటున్న వైద్య, ఆరోగ్య శాఖ
జిల్లాలో 61 ఆస్పత్రులకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, జననీ సురక్ష యోజన కింద రూ.1.75 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను ఏఏ పనులకు ఖర్చు చేశారన్న దానిపై 29 ఆస్పత్రులు నివేదికలు ఇవ్వలేదు. ఈ నెలాఖరులోపు ఖర్చుచేసిన వాటిపై లెక్కలు సమర్పించకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన నిధులకు కేంద్రం కోతపెట్టే అవకాశం ఉంది.
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్)కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి నిధుల్లో అక్రమాలు నెలకొన్నాయా? వైద్యశాలలో సౌకర్యాల కల్పన.. సామగ్రి కొనుగోలు.. మరమ్మతులకు వెచ్చించాల్సిన డబ్బులు దారిమళ్లాయా? ప్రస్తుతం జిల్లాలోని పలు ఆస్పత్రుల తీరు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. యేటా ప్రభుత్వం ఇచ్చే నిధులకు సంబంధించి వినియోగ పత్రాలను క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన ఆస్పత్రి యాజమాన్యాలు.. ఈ ఏడాది ఇప్పటికీ వాటిని సమర్పించలేదు. దీంతో అవకతవకలు జరిగాయనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అంతేకాకుండా ప్రాంతీయ, క్లస్టర్ ఆస్పత్రులు 12, జిల్లా ఆస్పత్రితో కలిపి 61 వైద్యశాలలున్నాయి. వీటికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద యేటా రూ.70లక్షలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా గతేడాది జనవరిలో ఈ నిధులను ఆయా ఆస్పత్రి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అంతే కాకుండా జననీ సురక్ష యోజన పథకం కింద రూ.1.05 కోట్లు కూడా ఈ ఆస్పత్రుల ఖాతాల్లో జమచేసింది. అయితే వీటికి సంబంధించి మార్చి 31 నాటికి తప్పనిసరిగా వినియోగ పత్రాల్ని సమర్పించాల్సి ఉంది. కానీ ఏప్రిల్ నెల ముగుస్తున్నా పలు ఆస్పత్రి కమిటీలు ఈ లెక్కల్ని బయటకు వెల్లడించకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.
లెక్కాపత్రం లేని 29 ఆస్పత్రులు..
వివిధ పద్దుల కింద ప్రభుత్వం ఇచ్చిన నిధుల వినియోగాన్ని పైసాతో సహా నమోదు చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాలో 61 ఆస్పత్రులకు రూ.1.75 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా.. వీటి వినియోగాన్ని లిఖిత పూర్వకంగా వివరించడంలో 29 ఆస్పత్రులు జాప్యం చేశాయి.
ఈ నెల పదో తేదీన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశానికి సైతం ఈ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్లు గైర్హాజరు కావడం గమనార్హం. వినియోగ పత్రాలను సమర్పించాల్సిందిగా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశించినప్పటికీ.. స్పందన కొరవడడంతో ఆయా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈనెలాఖర్లోపు వినియోగ పత్రాలను సమర్పించకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన నిధులకు కేంద్రం కోతపెట్టే అవకాశం ఉంది. ఈనేపధ్యంలో ఉన్నతాధికారులు పీహెచ్సీ డాక్టర్లపై ఒత్తిడి తెస్తుండగా.. వారు మాత్రం తాపీగా వ్యవహరించడంతో జిల్లా వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.