వృద్ధులకు ఊతకర్ర ‘సాక్షి’
తొలి ప్రయత్నంలోనే ఫలితాన్ని ఇచ్చిన ‘జనపథం’
8 మంది వృద్ధులకు పింఛన్లు ఇప్పించిన ఎమ్మెల్యే సోలిపేట
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘సాక్షి’ జనపథం పండుటాకులకు ఊత కర్ర అయింది. ‘ఇక మాకు పింఛన్ రాదేమో’ అని ఆందోళనలతో ఉన్న పండుటాకుల ముఖాల్లో జనపథం బోసి నవ్వులు పూయించింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు వృద్ధులకు అందిస్తున్న ‘ఆసరా’కు వాళ్లు అర్హత సాధించారు. మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చొరవతో ఎనిమిది మంది వృద్ధులకు అప్పటికప్పుడు పింఛన్ మంజూరు అయింది. ఎస్కేఎస్ (సమగ్ర కుటుంబ సర్వే) డాటాలో వయస్సు తక్కువుండి కంప్యూటర్ రిజెక్టు చేసిన వారికి ఐడీ ప్రూఫ్ పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారుడిగా ఎంపిక చేశారు.
కంప్యూటర్లో ఉత్పన్నమైన సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన మరో 10 మంది వృద్ధులు, వితంతవులకు కూడా త్వరలోనే పింఛన్ పునరుద్దరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మంగళవారం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని మారుమూల పల్లె అనాజ్‌పూర్‌లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘జనపథం’ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎంపీపీ అబ్బగౌని మంగమ్మ, జెడ్పీటీసీ సర్వుగారి వీరమణి ఎంపీడీవో మచ్చేంధర్, గ్రామకార్యదర్శి రవి, గ్రామ నాయకులు దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీతన్నలు, నేతన్నలు పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఆసరా పథకంలో తమ పేర్లు ఉన్నాయో.. తొలగించబడ్డాయో తెలియక ఆందోళన పడుతున్న వాళ్లకు ‘సాక్షి’ జనపథం పరిష్కారం చూపింది.
‘సాక్షి’ కృషి బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాదిరాళ్లు: ఎమ్మెల్యే
ఓ వర్గం మీడియా ఏసీ గదుల్లో, స్టూడియోల్లో కూర్చొని చర్చాగోష్టులంటూ తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళ పరుస్తోందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. దానికి భిన్నంగా సాక్షి మారుమూల పల్లెకు వచ్చి ప్రజల కష్టాలను, కన్నీళ్లను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, ప్రజా ప్రతినిధులను, అధికారులను ఒకే వేదిక మీదకు పిలిచి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే విధంగా అడుగులు వేయడం ఆహ్వానించదగిన పరిణామమని పేర్కొన్నారు. ఇలాంటి వేదికలు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాది రాళ్లు అవుతాయన్నారు.‘సాక్షి’ కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు.
అప్పటికప్పుడు లబ్ధిదారులు వీరే..
- పుల్లె బాలమల్లు (తండ్రి వెంకయ్య): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు.
- జంగపల్లి మల్లయ్య (తండ్రి చంద్రయ్య): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు.
- గడ్డం నారాగౌడ్ (తండ్రి బాలాగౌడ్): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు.
- కొత్త ప్రమీల (భర్త గోపాల్‌రెడ్డి): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు.
- చిట్మల్ వెంకటేశం (తండ్రి శివ్వయ్య): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు.
- మహ్మద్ మౌలానా (తండ్రి రహ్మాన్): ఎస్కేఎస్ డాటాలో వయస్సు తక్కువుండి ఐడీ ప్రూఫ్ ద్వారా ఎంపిక చేశారు.
- మంగళి మంగమ్మ (తండ్రి ఆంజనేయులు): పొరపాటున ఓఏపీగా నమోదవడం వల్ల పింఛన్ రద్దయింది. తిరిగి పీహెచ్సీ సర్టిఫికెట్ ఆధారంగా ఎంపిక చేశారు.
- ఎర్ర నర్సయ్య (తండ్రి బూమయ్య): సర్టిఫికెట్ల ఆధారంగా వయస్సు లేకపోయినప్పటికీ ఫిజికల్ అప్పియెరెన్స్ ద్వారా ఎంపిక చేశారు.