ప్రజల వల్ల ముఖ్యమంత్రినయ్యా
జనార్దన పూజారిపై మండిపడ్డ సీఎం సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: ‘లోకాయుక్త సంస్థ నన్ను ముఖ్యమంత్రిని చేయలేదు, రాష్ట్రంలోని ప్రజలు హైకమాండ్ నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టింది’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. తద్వారా తనపై విమర్శలు చేసిన సొంత పార్టీ నేత జనార్దన్ పూజారిపై పరోక్షంగా మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు నేపథ్యంలో రెండవ విడతగా సోమవారం ఉదయం బెళగావిలో కరువు పర్యటన చేపట్టిన సీఎం సిద్ధరామయ్య స్థానిక సాంబా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
‘ప్రజలు నా సారథ్యంలోని రాజకీయ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. వారు కోరుకున్న కారణంగా హైకమాండ్ నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. అంతేకానీ లోకాయుక్త సంస్థ కారణంగా నేను ముఖ్యమంత్రిని కాలేదు కదా’ అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని కరువు పరిస్థితిని అధ్యయనం చేయడానికి నాలుగు ఉప సమితులను నియమించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో ఏప్రిల్ 30లోపు తనకు వివరాలు అందజేయాల్సిందిగా ఆదేశించానని తెలిపారు. అధ్యయనం పూర్తయ్యి సమగ్ర నివేదికలు అందిన అనంతరం కరువు నష్ట పరిహార చర్యలు చేపడతామని తెలిపారు.