టూరిస్ట్ బస్సు బోల్తా
పాణ్యం:
తీర్థయాత్రలకు బయల్దేరిన ఓ ప్రైవేటు బస్సు మండల పరిధిలోని నూలుమిల్లు వద్ద సోమవారం ఉదయం 7.30 గంటలకు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృత్యువాత పడగా, మరో 22 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణా రాష్ట్రానికి చెందిన జనతా ట్రావెల్స్ బస్సు(ఏపీ 09 ఎక్స్ 4999)లో హైదరాబాద్, కోటి, దిల్షుఖ్నగర్, తెనాలి, చైతన్యపూరి, వివిధ పట్టణాలకు చెందిన 44 మంది భక్తులు తీర్థయాత్రల కోసం రెండు రోజుల క్రితం బయల్దేరారు.
ఆయా పుణ్యక్షేత్రాలు దర్శించుకొని శబరిమలకు వెళ్తుండగా పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్ద రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయిన డ్రైవర్ అక్రమ్ హుసేన్ సడన్గా బ్రేకులు వేయడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన, బస్సులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను స్థానికులు వెలుపలికి తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పాణ్యం ఎస్ఐ సుబ్రమణ్యం, మన్మదవిజయ్ చేరుకొని హైవే పెట్రోలింగ్ వాహనం, ఆటోల్లో క్షతగాత్రులను నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా తెనాలికి చెందిన కాత్యాయనమ్మ(60) కోలుకోలేక మృతి చెందింది. బస్సు కండీషన్ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్రమణ్యం పేర్కొన్నారు.