భయపడొద్దు.. దెయ్యాలు లేవు
♦ ఇబ్రహీంపట్నం ముదిరాజ్ బస్తీలో జనం ఆందోళన
♦ జేవీవీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
ఇబ్రహీంపట్నం: దెయ్యాలు లేవని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. తమ బస్తీలు దెయ్యాలు తిరుగుతున్నాయని ఇబ్రహీంపట్నంలోని ముదిరాజ్ బస్తీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వివరాలు.. ఇబ్రహీంపట్నం ముదిరాజ్ బస్తీకి చెందిన హనుమంతు కృష్ణ, సంతోష(25) దంపతులు. కొంత కాలంగా వీరు సంతోష పుట్టిల్లు అయిన నల్గొండ జిల్లా చిట్యాలలో ఉంటున్నారు. దంపతుల మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో గత 4న సంతోష ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే ఆమె నిండు గర్భిణి. హనుమంతు కృష్ణ బంధువులు సంతోష మృతదేహాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు.
మృతదేహం సరిగా కాలిపోకపోవడంతో మరుసటి రోజు తిరిగి కాల్చివేశారు. అనంతరం హనుమంతు కృష్ణ వెళ్లిపోయాడు. పక్క ఇంట్లో ఉండే ఆయన పెద్దనాన్న ఎల్లయ్య కుమారుడు హనమంతు రవి ఇటీవల పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. తనకు దెయ్యం ఆవహించిందని చెబుతున్నాడు. ఈవిషయంలో అతడి కుటుంబీకులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా, గత డిసెంబర్లో బస్తీకి చెందిన నల్లగొడుగు బాలమ్మ(60) మృతిచెందింది. బాలమ్మ దెయ్యమైందని స్థానికులు భయపడుతున్నారు. ఈనేపథ్యంలో బస్తీలో జనసంచారం తగ్గిపోయింది. సాయంత్రం అయితే చాలు ఇళ్లకు గడియ పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
అవగాహన నిర్వహించిన జన విజ్ఞాన వేదిక
బస్తీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞానవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడారు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనుషులు ఎక్కువగా దాని గురించే అలోచిస్తారని, ఈక్రమంలో మానసికంగా దాని ప్రభావం పడి ఆయా వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు వ స్తుందన్నారు. దీంతో దెయ్యం పట్టిందని జనాలు మూఢంగా విశ్వసిస్తారని తెలిపారు. ఇక్కడున్న దెయ్యాన్ని తాను పట్టుకెళ్తానని ఆయన ఓ బెలూన్ను చూపించారు. మూఢ విశ్వాసాలను నమ్మొదని చెప్పారు.
నేను శ్మశానాల్లో నిద్రించాను..
కార్యక్రమంలో సీఐ జగదీశ్వర్ మాట్లాడుతూ.. తాను కొన్ని సందర్భాల్లో విధి నిర్వహణలో శ్మశానవాటికల్లో నిద్రించానని తెలిపారు, దెయ్యాలు ఉన్నాయనేది అభూత కల్పన మాత్రమేనని తెలిపారు. మానసిక జబ్బులతో భయాందోళనకు గురికావొద్దని చెప్పారు. దె య్యాలు లేవని, జనం భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాత్రివేళల్లో బస్తీలో గస్తీని పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీవీ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, సీపీఎం నాయకులు సామెల్, శంకర్, జంగయ్య, వెంకటేష్, షఫిఉన్నిషా బేగం తదితరులు పాల్గొన్నారు.