వేదికపై కుప్పకూలి ప్రాణాలు వదిలింది
గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన అమెరికాకు చెందిన ప్రముఖ సంగీతకారిణి(బాసిస్ట్) జేన్ లిటిల్ కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం సంగీత ప్రదర్శన ఇస్తుండగా వేదికపై కుప్పకూలిపోయారు. తర్వాత ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 87 ఏళ్లు. ఒకే ఆర్కెస్ట్రా తరపున ఎక్కువ కాలం కొనసాగినందుకు ఆమె గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు.
బాస్ గిటార్ విద్యాంసురాలైన ఆమె 16 ఏళ్ల ప్రాయంలో 1945లో అట్లాంటా సింఫనీ ఆర్కెస్ట్రా(ఏఎస్ఓ)లో చేరారు. హైస్కూల్ లో రెండేళ్ల పాటు బాస్ గిటార్ నేర్చుకుని ఏఎస్ఓలో సభ్యురాలయ్యారు. అప్పటి నుంచి 71 ఏళ్లుగా అదే ఆర్కెస్ట్రాలో కొనసాగారు. నలుగురు సంగీత దర్శకులు సారథ్యంలో ఆమె పనిచేశారు.
జేన్ లిటిల్ మరణం పట్ల ఏఎస్ఓ ప్రగాఢ సంతాపం తెలిపింది. తనకు ఇష్టమైన వాయిద్యంతో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తూనే జేన్ కన్నుమూయడం ఆమె చేసుకున్న పుణ్యమని పేర్కొంది. ఏఎస్ఓలో సీనియర్ సభ్యురాలైన జేన్ మరణం తమకు తీరని లోటని వెల్లడించింది.