పసుపుచొక్కాల ఫోజులు !
సాక్షి, చిత్తూరు: ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమం పసుపు చొక్కాల ప్రచారంగా ముగిసింది తప్ప ప్రజాసమస్యల పరిష్కారం కోసం మాత్రం ఉపయోగపడలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ రెండు నుంచి నేటి వరకు రెండు విడతలుగా జరిగిన జన్మభూమి కార్యక్రమంలో కేవలం అరకొర పింఛన్లు పంపిణీ చేయడంతప్ప ఒరగబెట్టింది లేదు. గ్రామాల్లో చిన్నపాటి తాగునీటి పంపులు రిపేరు చేయమన్నా పైసలు లేవంటూ అధికారుల తప్పించుకోవడం చూస్తే జన్మభూమి ఎలా జరిగిందో తెలుస్తుంది.
తాగునీరు,రోడ్లు, పక్కాగృహాలు,పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలకు చూస్తాం- చేస్తామంటూ దేశం ప్రజా ప్రతినిధులు,మంత్రులు,అధికారులు తప్పించుకునేందుకు నానా పాట్లు పడ్డారు. ఇక దేశం నేతలు ప్రొటోకాల్ పక్కకు నెట్టి జన్మభూమి సభల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేదనట్లు మిన్నకుండి పోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీ మద్దతుదారులంటూ అర్హులైన వారి పింఛన్లు తొలగించడంపై సభల్లో పలుచోట్ల ప్రజలు దేశం నేతలను,ప్రజాప్రతినిధులను నిలదీశారు.
జిల్లాలో తాగేందుకు గుక్కెడు నీళ్లివ్వలే నపుడు సభలు,సమావేశాలు ఎందుకంటూ ప్రజలు ప్రజాప్రతినిధులను నిలదీశారు. డ్వాక్రా మహిళలు ,రైతులు రుణమాఫీ ఏదంటూ ప్రశ్నించారు. అన్నింటికీ మౌనమే సమాధానమైంది. జన్మభూమి సభలు పోలీసుల రక్షణవలయంలో నడిపించడం చూస్తే అవి జరిగిన తీరు స్పష్టమవుతుంది. మొత్తంగా జన్మభూమి - మా ఊరు ప్రజాసమస్యల పరిష్కారం కోసం కాకుండా దేశం నేతల ప్రచార కార్యక్రమంగా ముగిసింది. ఇక అధికారులు మాత్రం జన్మభూమిలో చేసింది చూడండంటూ గణాంకాలు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలను కేవలం పింఛన్ల పంపిణీ, దరఖాస్తుల సేకరణతోనే సరిపెట్టారు.
దీంతో పాటు వైద్యశిబిరాలు, పశువుల వైద్యశిబిరాలను కూడా నిర్వహించినప్పటికీ లక్ష్యాలు మాత్రం పూర్తి చేయలేక పోయారు. పోనీ పింఛన్లు అయినా పూర్తిగా పంపిణీ చేశారా ? అంటే అదీలేదు. జిల్లాలో వికలాంగులు, వితంతువులు 308305 మందికి రూ.41కోట్లను పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం రూ.23.42కోట్లను మాత్రమే పంపిణీ చేశారు. వీటితో పాటు పశువైద్యశిబిరాలు,హెల్త్ క్యాంపులు, పేదరికంపై గెలుపు కార్యక్రమంలో భాగంగా నైపుణ్యం కలిగిన యువత గుర్తింపు, వ్యక్తిగత మరుగుదొడ్ల ఏర్పాటుకు రాయితీ ప్రచారం అంటూ రకరకాల గణాంకలతో ఎట్టకేలకు జన్మభూమి - మా ఊరును ముగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.