రేపు తిరుపతి-హైదరాబాద్ కు ప్రత్యేక రైలు
తెనాలి (గుంటూరు జిల్లా) : వారాంతంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం తిరుపతి-హైదరాబాద్ (వయా తెనాలి, గుంటూరు, నల్గొండ) జనసాధారణ్ ప్రత్యేక రైలును నడుపనుంది. పది బోగీలు కలిగిన ఈ ప్రత్యేక రైలులో అన్ని బోగీలు అన్ రిజర్వుడ్‌గా ఉంటాయి. నం.07269 తిరుపతి-హైదరాబాద్ జనసాధారణ్ ప్రత్యేక రైలు తిరుపతిలో ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం తెల్లవారుజామున 5.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
మార్గమధ్యంలో రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, తెనాలి (రాత్రి 8.50 గంటలకు), గుంటూరు (రాత్రి 10 గం.), సత్తెనపల్లి (రాత్రి 11.15 గం.), పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌లో ఆగుతుందని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.