విభజన, విద్వేషాల పాపం వాళ్లదే
జంతర్‌మంతర్ వద్ద ధర్నాలో వైఎస్ విజయమ్మ ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం అగ్నిగుండంలా మారడానికి, అన్ని ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషపూరిత వాతావరణం నెలకొనడానికి కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా బాధ వేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ స్వార్థంతో ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర చరిత్రను మార్చాలని చూస్తోందన్నారు. ‘‘కనీసం తెలంగాణలోనైనా సీట్లు వస్తాయన్న ఉద్దేశంతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించడానికి యత్నిస్తోంది. అలాంటి కాంగ్రెస్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు కుమ్మక్కయ్యారు. విభజనతో అవతల ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా ఆయన నోరు ఎత్తడంలేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనిగాని, న్యాయం చేయాలనిగాని అడగడం లేదు’’ అని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనపై అడ్డగోలుగా నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ, సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ విజయమ్మ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో విజయమ్మ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
విజయమ్మ నాయకత్వం వహించిన ఈ ధర్నాలో పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, ఢిల్లీలోని ప్రవాసాంధ్రులు, అందులోనూ మహిళలు తరలివచ్చి పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 10.45 గంటలకు ధర్నా శిబిరానికి విజయమ్మ చేరుకున్నారు. ఆ వెంటనే జై జగన్, జై వైఎస్సార్, జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తర్వాత విజయమ్మ వేదికపై కూర్చొని ధర్నా ప్రారంభించారు. అనంతరం విజయమ్మ అనేక అంశాలను స్పృశిస్తూ ప్రసంగించారు. ప్రసంగం ఆమె మాట్లోలనే..
వైఎస్ కలలు కన్న రాష్ట్రమేనా ఇది?
‘‘రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే చాలా బాధేస్తోంది. వైఎస్ కలలు కన్న రాష్ట్రమేనా ఇది? ఈ రోజు రాష్ట్రం అగ్నిగుండలా తయారువుతోంది. ఏ ప్రాంతంలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. సీమాంధ్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెన్‌డౌన్ చేశారు. సాక్షాత్తు రాజధానిలోనే అన్ని కార్యాలయాల్లో వేర్వేరుగా వాదులాటలు, పోరాటాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం, పరిపాలన గాడితప్పింది. నిజంగా స్తంభించిపోయింది. ముఖ్యమంత్రి, మంత్రులు దాదాపు 13 రోజుల నుంచి ఆఫీసులకు పోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల మధ్య స్నేహాలు, ప్రేమలు కనుమరుగయ్యాయి. వాతావరణం చాలా భయంకరంగా, భయానకంగా కనిపిస్తోంది. దీనికి ఎవరు కారణం అంటే? కాంగ్రెస్, టీడీపీల రాజకీయాలే కారణం అని చెప్పాలి.
రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోంది..
భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఒక ప్రాతిపదిక ఉండాలని ఆ నాడు నెహ్రూ మొదటి ఎస్సార్సీ ప్రతిపాదన చేశారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ అలాగే రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. చాలా చిన్న రాష్ట్రంగా ఉన్న నాగాలాండ్ కూడా భాషా ప్రాతిపదికన ఏర్పడింది. ఇవన్నీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేశాకే రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. ఇక బీజేపీ ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఇచ్చినప్పుడు కూడా అసెంబ్లీలలో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. నాడు మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న దిగ్విజయ్ సింగ్ కూడా అసెంబ్లీలో తీర్మానం చేశాకే జార్ఖండ్ ఇచ్చారు. మరి ఆయనే ఇవాళ మన రాష్ట్రం విషయానికి వచ్చే సరికి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదంటున్నారు. 2009లో 33 మంది ఎంపీలను వైఎస్ గెలిపించడం వల్లే ఈ రోజు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో పరిపాలన జరుగుతోంది. కాంగ్రెస్‌కు పట్టం కట్టిన తెలుగుజాతికి.. ఇవాళ రాష్ట్రాన్నిముక్కలు చేసి బహుమతిగా ఇస్తున్నారు. విభజనకు ప్రాతిపదిక ఏమిటో కూడా చెప్పకుండా కొన్ని కోట్ల మంది ప్రజలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోంది.
చంద్రబాబూ.. హైదరాబాద్‌ను ఎందుకు పోగొట్టుకోవాలి?
కాంగ్రెస్ వైఖరి ఇలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వంతపాడుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ ఇవ్వాలని ఆయన లేఖ ఇచ్చారు. విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రకటించాక కూడా చంద్రబాబు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే ఇంతకన్నా మంచి రాజధాని కట్టుకోవచ్చని అన్నారు. హైదరాబాద్‌లాంటి రాజధానిని మీరు నాలుగైదు లక్షల కోట్లతో కట్టగలరా చంద్రబాబూ? అసలు హైదరాబాద్‌ను తెలుగువారు ఎందుకు పోగొట్టుకోవాలని అడుగుతున్నా.
ప్రకటనకు ముందే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల రాజీనామా..
తెలంగాణ ఇవ్వబోతున్నారని తెలిసి, ఆ ప్రకటన రావడానికి ఐదు రోజుల ముందే రాష్ట్రంలోని పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో హోం మంత్రి షిండేకు లేఖ రాయించాం. ఆ వెంటనే 16 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాం. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసింది ఒక్క వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే. కాంగ్రెస్ నిర్ణయంతో కొన్ని కోట్లమంది రోడ్లమీద పడి ఆక్రందనలు చేస్తున్నా, కేంద్రంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ వినిపించే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో నేను, జగన్‌బాబు కూడా రాజీనామా చేశారు. గతంలో రాష్ట్ర విభజన ప్రతిపాదన వచ్చినప్పుడు 130 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకున్నారు. ఇవాళ మీరెందుకు రాజీనామా చేయలేకపోతున్నారనీ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ అడుగుతున్నా. పీసీసీ అధ్యక్షుడికో, మరెవరికో కాకుండా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు పంపించి ఉంటే సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదని చెబుతున్నాం. ఈ రోజైనా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేయాలని కాంగ్రెస్, టీడీపీని అడుగుతున్నాను.
ఆ కమిటీల నివేదికలు ఏం చేశారు?
ఆంటోనీ కమిటీ వేశామని చెబుతున్నారు. అంటోనీ కమిటీ కాంగ్రెస్ కమిటీయే. విభజన నిర్ణయంపై కాంగ్రెస్ వెనక్కి పోదని ఒకవైపు, సమస్యలుంటే ఆంటోనీ కమిటీకి చెప్పాలని ఇంకోవైపు దిగ్విజయ్ సింగ్ ఉదయం, సాయంత్రం రెండు పూటలా చెబుతున్నారు. ప్రణబ్ కమిటీ ఏం చేసింది? వైఎస్ వేసిన రోశయ్య కమిటీ ఏం చేసింది? శ్రీకష్ణ కమిటీకి రూ.30 కోట్లు ఖర్చు అయ్యాయి. రాష్ట్ర విభజనకు అవకాశమే లేదని, కలిపే ఉంచాలని ఆ కమిటీ చెప్పినవన్నీ ఏం చేశారు? అసలు తెలుగువారి మనోభావాలను అర్థం చేసుకునే వారొక్కరైనా ఆంటోనీ కమిటీలో ఉన్నారా? మన రాష్ట్రం, ప్రజల మనోభావాల గురించి సోనియాకు ఏం తెలుసు? ఏ విధంగా విభజన చేస్తారు? ‘అధికారం మా చేతిలో ఉంది కాబట్టి విభజిస్తాం’ అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి.
విభజనకు వైఎస్ పేరును వాడుకుంటున్నారు..
రాజశేఖరరెడ్డి ఎంతటి సమైక్యవాదో అందరికీ తెలుసు. రోశయ్య కమిటీ వేసినప్పుడు.. తెలంగాణ ఇవ్వాల్సి వస్తుందేమో అని సోనియా చెప్పగా, మనకు రెండో ఎస్సార్సీ అనే ప్రాతిపదిక ఉంది కదమ్మా.. అని వైఎస్ చెప్పారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో రెండో ఎస్సార్సీ పెట్టారు. కేసీఆర్ కూడా రెండో ఎస్సార్సీకి ఆమోదించి సంతకం చేశారు. ఈ రోజు వైఎస్సార్ సీపీ ఏదైతే చెబుతా ఉందో, అదే ఆ రోజు వైఎస్ కూడా సోనియాకు చెప్పారు. విభజన చేయాల్సి వస్తే నీటి వనరులు, తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారు, హైదరాబాదులో స్థిరపడినవారు, ప్రత్యేక ఉత్తరాంధ్ర, రాయలసీమ డిమాండ్ల పరిస్థితేమిటి.. అన్న తొమ్మిది అంశాలతో రోశయ్య కమిటీ వేశారు. ఆ అంశాలన్నింటికీ సమాధానం దొరికినప్పుడే విభజించడానికి వీలవుతుందని, లేకుంటే కలిపి ఉంచడమే మంచిదని వైఎస్ నాడు చెప్పారు. కానీ ఈ రోజు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ నాయకులు వైఎస్ పేరును వాడుకుంటున్నారు. రాష్ట్రాన్ని విభజించాలని వైఎస్ ఎప్పుడూ, ఏరోజూ చెప్పలేదు. అందరూ సంతోషంగా ఉండాలి, తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని వైఎస్ కోరుకునేవారు. విభజన అనేది మౌలికమైన, జఠిలమైన అంశాలతో కూడుకున్నది. ఇందులో విడదీయలేనంతగా సమస్యలు ఉన్నాయి కాబట్టి యథాతథంగా ఉంచాలని కోరుతున్నాం. తెలుగు ప్రజలెవరూ, తెలంగాణ ప్రాంతం వారు కూడా విభజన కోరుకోవడం లేదు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఇవాళ ప్రాణహిత చేవెళ్ల పూర్తయితే కానీ వాళ్లకు కూడా న్యాయం జరగదు. వాళ్లకు కావాల్సినంత కరెంటు లేదు. ఉచిత విద్యుత్‌తో తెలంగాణ ముందుకు పోయిన పరిస్థితి చూశాం. రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సరైన న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ కోరుతోంది.
జగన్ విషయంలో ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం..
సమన్యాయం చేయలేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని మేం గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే.. ఆరో రోజు అర్ధరాత్రి బలవంతంగా దీక్షను భగ్నం చేశారు. వారు బలవంతంగా దీక్షను భగ్నం చేశారుకాని.. ప్రజల ఉద్యమాన్ని, ఆగ్రహాన్ని పట్టించుకోకుంటే ఏ ప్రభుత్వమూ మనలేదు. జగన్‌ను ఆన్యాయంగా, అక్రమంగా జైలులో పెట్టారు. జైలులో పెట్టి నిన్నటికి(మంగళవారం) 16వ నెల వచ్చింది. తన విషయంలో ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య పెద్ద యుద్ధం జరుగుతోంది. విలువలకు, విశ్వసనీయతకు, మాటలకు కట్టుబడిన వ్యక్తిని అన్యాయంగా జైలులో పెట్టారు. తాను జైల్లో ఉన్నప్పటికీ జగన్ ప్రజల కోసమే ఆలోచన చేస్తున్నారు. నా దీక్షను భగ్నం చేయడంతో తానే జైలులో దీక్షకు పూనుకున్నాడు. కాంగ్రెస్ నిరంకుశ నిర్ణయానికి నిరసనగా జగన్‌బాబు జైలులో దీక్ష చేస్తుంటే.. ములాఖత్‌లు నిలిపేస్తారని, వేరే చోటకు తరలిస్తారని అంటూ రకరకాలుగా భయపెట్టాలని చూశారు. అయినప్పటికీ జగన్ నిరవధికంగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు.
మేం పోగొట్టుకున్నవి మాకు ఇవ్వగలరా?
మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడానికి ముందు ఎన్నో ప్రాంతాలను విడగొట్టారు. బల్లారి, కోరాపుట్లను కర్ణాటక, ఒడిశాలకు కలిపారు. కృష్ణా, గోదావరి జిల్లాలకు చెందిన భద్రాచలాన్ని, మునుగాలను తెలంగాణ జిల్లాలో కలిపారు. తెలుగువారంతా కలిసి ఉండాలని ఇవన్నీ పోగోట్టుకున్నారు. పోగొట్టుకున్నవి ఇప్పుడు మాకు తిరిగి ఇవ్వగల్గుతారా..అని అడుగుతున్నా’’