శ్రీసిటీలో జపాన్ పారిశ్రామిక సంస్థల బృందం
సత్యవేడు : జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు చెందిన 17మంది సభ్యుల బృందం సోమవారం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ (సత్యవేడు)లో పర్యటించింది. ప్రఖ్యాత ఏక్కాన్ కాగ్యో షింబున్ ప్రచురణ సంస్థ అధ్యక్షుడు హరుహిటో ఇమిజూ, మన దేశ జపాన్ మాజీ రాయబారి యసుకునీ యనోకీ ఆధ్వర్యంలో వీరు శ్రీసిటీని సందర్శించారు. మన దేశంలో వ్యాపారాభివృద్ధికిగల అవకాశాలను పరిశీలించడానికి వారు వచ్చారు.
శ్రీసిటీలో ఏర్పరచిన అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, జపాన్ దేశ పరిశ్రమలకు కేటాయించిన ప్రదేశం విశిష్టత, శ్రీసిటీ సాధించిన ప్రగతిని శ్రీసీటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి వారికి వివరించారు. బృందం సభ్యులు కొబెల్కో, డేనియల్ పరిశ్రమలను సందర్శించారు. జపాన్ పరిశ్రమలకు ప్రత్యేకంగా ఏర్పరచిన ప్రదేశం అత్యంత అనుకూలంగా ఉందని, జపాన్ నుంచి మరిన్ని పరిశ్రమలు శ్రీసిటీకి రావడానికి తమ సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.