ప్లాస్టిక్.. పెట్రోల్!
ప్లాస్టిక్ చెత్తతో ఎన్నో చిక్కులు! భూగర్భంలోకి నీరు ఇంకనివ్వదు.. మురుగునీరు సాఫీగా ప్రవహింపనీయదు.. ఎండకు ఎండి, వానకు తడిసినా ఏళ్ల తరబడి చెక్కు చెదరదు. పైగా ప్రమాదకరమైన రసాయనాలూ వెదజల్లుతూంటుంది. పోనీ వాడటం మానేద్దామా అంటే అస్సలు కుదరని పరిస్థితి. అందుకే.. జపాన్ శాస్త్రవేత్త అకినోరి ఇటో ఈ చిక్కులన్నింటికీ ఓ చక్కటి పరిష్కారాన్ని కనుక్కున్నారు. ఈ యంత్రంతో దాదాపు అన్ని రకాల ప్లాస్టిక్ చెత్తనూ ముడిచమురుగా..
దాని నుంచి పెట్రోలుగానూ మార్చవచ్చని ఆయన అంటున్నారు. ఒక్క పాలీఇథిలీన్ టెరెప్థలైట్(పెట్) బాటిళ్లు మినహా మిగిలిన అన్నిరకాల ప్లాస్టిక్ (పాలిథీన్, పాలిస్టిరీన్, పాలిప్రొపెలీన్)నూ ఈ యంత్రంతో పెట్రోలుగా మార్చవచ్చు. నిజానికి ప్లాస్టిక్‌ను పెట్రోలుగా మార్చడం ఇదే తొలిసారి కాదు. నాగ్‌పూర్‌కు చెందిన ప్రొఫెసర్ అల్కా జడ్గావ్కర్ దశాబ్దం క్రితమే టెక్నాలజీని అభివృద్ధి చేశారు కూడా. అయితే వివిధ కారణాల వల్ల అది అంత ప్రాచుర్యం పొందలేదు. ఒడిశా శాస్త్రవేత్తలు అచ్యుత్ పండా, రఘువంశ్ కూడా ఇలాంటి పద్ధతిని అభివృద్ధి చేశారు.
ప్లాస్టిక్ తయారికీ వ్యతిరేకం..
ముడిచమురు శుద్ధీకరణ ద్వారా పెట్రోలు, డీజిల్, కిరోసిన్ వంటి ఇంధనాలతోపాటు ప్లాస్టిక్, మైనం వంటి పదార్థాలనూ తయారు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, అకినోరి ఇటో టెక్నాలజీ దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. పాలిథీన్ సంచులు, ప్యాకేజింగ్‌లో వాడే పాలిస్టిరీన్ ఫోమ్ వ్యర్థాలను చిన్నచిన్న ముక్కలుగా మార్చి యంత్రం లో వేస్తారు. తర్వాత విద్యుత్ సాయంతో వ్యర్థాలను వేడిచేసి ఆవిరిగా మారుస్తారు. ఈ ఆవిరిని ప్రత్యేక పద్ధతుల ద్వారా చల్లబరిచి, సంక్షేపణం (చల్లటి నీరున్న గ్లాసు బయటిభాగంలో నీటిబొట్లు ఏర్పడతాయి కదా అలా అన్నమాట) ప్రక్రియ ద్వారా ముడిచమురును పోలిన పదార్థం తయారవుతుంది.
కేవలం ఒక కిలోవాట్ శక్తిని వాడుకుని ఈ యంత్రం రెండు పౌండ్లు(ఒక కిలో) ప్లాస్టిక్‌ను లీటర్ కంటే కొంచెం తక్కువ మోతాదు ముడిచమురుగా మారుస్తుందని చెబుతున్నారు. దీన్ని నేరుగా జనరేటర్లలో వాడుకోవచ్చు. లేదంటే శుద్ధి చేసుకుని పెట్రోలు, డీజిల్ వంటి ఇతర ఇంధనాలను ఉత్పత్తి చేసుకోవచ్చు కూడా. ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా వాడుకోవడం ద్వారా వాతావరణ కాలుష్యా న్ని కొంతమేరకైనా తగ్గించవచ్చునని ఇటో అంటున్నారు. అవును మరి.. ప్లాస్టిక్ చెత్తను ఇలా సద్వినియోగం చేసుకుంటే పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుంది కదూ!