14న బుల్లెట్ రైలు శంకుస్థాపన
హాజరుకానున్న మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే
అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సెప్టెంబర్ 14న నిర్వహించనున్న శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే పాల్గొంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి సబర్మతీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దాదాపు రూ.98,000 కోట్లతో చేపడుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు వ్యయంలో 81 శాతాన్ని జపాన్ రుణంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 13న గుజరాత్‌కు చేరుకోనున్న మోదీ, అబేలు 14న జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా మోదీ, అబేలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలు 2023లో అందుబాటులోకి రానుంది. దీనిద్వారా ముంబై నుంచి అహ్మదాబాద్(508 కి.మీ)కు రెండు గంటల్లో చేరుకోవచ్చు.