మళ్లీ అమ్మాయే పుట్టిందని..
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి):
ఆడపిల్ల పుట్టిందని వదిలించుకోవడానికి దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. యాచారం మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన జర్పుల కృష్ణ భార్య లక్ష్మికి ఇప్పటికే నాలుగు కాన్పులయ్యాయి. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయిదో కాన్పులో ఈనెల 6వ తేదీన లక్ష్మికి కూతురు పుట్టింది. ఆడ పిల్ల కావటంతో పోషించే స్తోమత లేక వదులుకునేందుకు నిర్ణయించుకున్నారు. వారు ఇబ్రహీంపట్నంలో ఐసీడీఎస్ సీడీపీవో శాంతిశ్రీని సంప్రదించారు.
ఆమె సూచనల మేరకు గురువారం ఐసీడీఎస్ కార్యాలయంలో తమ కూతురును అప్పగించారు. కౌన్సెలింగ్ చేసినా ఆ తల్లిదండ్రుల మనస్సు మారలేదని సీడీపీవో తెలిపారు. దీంతో వారి నుంచి ఒప్పందం పత్రం రాయించుకుని చిన్నారిని శిశు విహార్‌కు తరలించామన్నారు. ఇప్పటికైనా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని ఆ దంపతులకు సూచించామని శాంతిశ్రీ తెలిపారు.