గోరటికి జాషువా పురస్కారం
గుంటూరు ఈస్ట్: శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రజా నాట్య మండలి, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాషువా కవిత పురస్కార ప్రధానోత్సవ సభ మంగళవారం నిర్వహించారు. ప్రముఖ ప్రజా గాయకుడు గోరటి వెంకన్నకు పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం డీన్ ఆచార్య డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, జాషువా విజ్ఞాన కేంద్రం పాశం రామారావు తదితరులు ప్రసంగించారు. జాషువా స్ఫూర్తితో గోరటి వెంకన్న తన గళంతో ప్రజా సమస్యలపై పోరాడుతున్న యోధుడని కొనియాడారు. జాషువా ఏ లక్ష్యంతో తన కలాన్ని వాడారో అదే మార్గంలో గోరటి వెంకన్న నడుస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రజానాట్య మండలి రమణ బృందం జాషువా పద్యాలను ఉత్సాహ భరితమైన జానపద వాయిద్యాలతో ఆలపించారు. సభకు నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ జాషువా పురస్కార ప్రధాన సంఘ అధ్యక్షుడు ఎస్ .బాలస్వామి సభకు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సంస్కృతి వ్యవస్థాపకుడు బాలచందర్ , ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ముత్యం, అభిమానులు పాల్గొన్నారు.