ఆస్ట్రేలియన్ వీసా రాకెట్ బట్టబయలు..
సిడ్నీ: భారతీయులకు ఉద్యోగాలు, విద్యావకాశాల పేరుతో నకిలీ వీసాలను అందిస్తున్న అతిపెద్ద నకిలీ వీసా రాకెట్ ను మెల్ బోర్న్ లో నివసిస్తున్న భారతీయుడు బట్టబయలు చేశారు. దాదాపు 40 మంది భారతీయులకు ఈ స్కాంతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. మెల్ బోర్న్ లోని ఆర్ఎమ్ఐటీ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తున్న జస్విందర్ సిద్దూ ను కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా ఓ వ్యక్తి భారతీయులకు వీసాలు కావాలంటే ఏర్పాటు చేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, విద్యార్థులు ఎవరైనా ఆస్ట్రేలియాలో చదువుకోవాలంటే వీసాలు ఇప్పిస్తానంటూ సంప్రదించాడు.
ఒక వ్యక్తికి ఉద్యోగానికి గానీ, చదువు కోసం గానీ వీసాను ఏర్పాటు చేస్తే ఐదు వేల యూఎస్ డాలర్లను సిద్దూకి ఆఫర్ చేశాడు. మెకానిక్స్, హోటల్ మేనేజ్ మెంట్, ఐటీ రంగాల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తెలిసిన వారు ఉంటే తనకు చెప్పాలని అడిగాడు. కాగా, సిద్దూ ఆ వ్యక్తి తో జరిపిన సంప్రదింపులన్నింటినీ హిడెన్ కెమెరా ద్వారా రికార్డు చేసి కేసును బలపరిచేందుకు దీనిని సాక్ష్యంగా ఉపయోగించారు.
స్కాంపై మాట్లాడిన సిద్దూ.. గత పదేళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నానని చెప్పారు. వీసా సమస్యలు వస్తే ఇక్కడి ఉద్యోగ సంస్థలు భారతీయులను రేప్ చేసిన సంఘటనలు ఉన్నాయని, పెద్ద ఎత్తున వీసా మోసాలు జరుగుతున్నాయని తరచూ తన దృష్టికి వచ్చేదని తెలిపారు. వీటన్నింటినీ బయటపెట్టి ముఠా ఆట కట్టించాలని తాను భావించినట్లు వివరించారు. అనుకున్నట్లే తనను సంప్రదించిన వ్యక్తికి తెలియకుండా మొత్తం స్కాంను రికార్డు చేసినట్లు చెప్పారు. ఈ స్కాంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని తెలిపారు. పెద్ద స్థాయిలో ఉన్న ఆస్ట్రేలియన్ అధికారులకు, కొంతమంది భారతీయులకు స్కాంతో సంబంధం ఉందని వివరించారు.