గ్యాంగ్‌రేప్‌ల పై త్రిసభ్య కమిటీ
ఛండీగఢ్/న్యూఢిల్లీ: జాట్ల ఉద్యమం జరుగుతున్న సమయంలో సోనీపట్ జిల్లాలోని ముర్తాల్ వద్ద మహిళలపై అత్యాచారాలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు హరియాణా ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఒక డీఐజీ సహా ముగ్గురు మహిళా పోలీసు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ర్ట అదనపు చీఫ్ సెక్రటరీ పీకే దాస్ తెలిపారు. ఈ కమిటీలో డీఐజీ రాజ్శ్రీ సింగ్, డీఎస్పీ భారతీ దబాస్, డీఎస్పీ సురిందర్ కౌర్ సభ్యులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యాచారానికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలకు సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
అత్యాచారాలకు సంబంధించి ఫిర్యాదులు, సమాచారం అందించాలనుకునేవారు 18001802057 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోల రూపంలో ఆధారాలు ఏమైనా ఉంటే తమకు పంపించాల్సిందిగా పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కానీ ఫిర్యాదులు కానీ తమకు అందలేదని హరియాణా డీజీపీ వైపీ సింఘాల్ పేర్కొన్నారు. అయితే ఏ చిన్న సమాచారం అందినా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 30కి చేరిందని తెలిపారు. ముర్తాల్ అత్యాచార బాధితుల్లో ఢిల్లీకి చెందిన వారు ఎవరైనా ఉంటే న్యాయం కోసం తమ కార్యాలయంలో కాని, లేదా 181 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ సూచించారు. ఆందోళనల్లో భాగంగా జాట్ లు 17 వేల చెట్లను నరికేశారు.