వీరుడా.. సలాం..
అమరజవాను ముస్తాక్‌కు తుదివీడ్కోలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సియాచిన్ మంచుతుపానులో ప్రాణాలు కోల్పోయిన జవాను ముస్తాక్ అహ్మద్ పార్థివదేహానికి ఆయన స్వగ్రామమైన పార్నపల్లె (కర్నూలుజిల్లా) లో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముస్తాక్ మృతికి సంతాపసూచకంగా అటు ఆర్మీతో పాటు స్థానిక పోలీసులు చెరో మూడు రౌండ్లు కాల్పులు జరి పారు.
సైనిక బ్యాండు శబ్దాల మధ్య 9 పటాలాల సైనికాధికారులు ముస్తాక్ పార్థివదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్నపల్లె వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరయ్యారు. ముస్తాక్ కుటుంబానికి రూ.25 లక్షల పరి హారాన్ని అందజేశారు. నంద్యాల లేదా కర్నూలులో 300 గజాల స్థలాన్నిస్తామని, అర్హతను బట్టి భార్యకు ఉద్యోగం ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, కలెక్టర్ విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు.