సైనికుల పిల్లల చదువుకు క్రికెటర్ సాయం
న్యూఢిల్లీ: దేశాన్ని గెలిపించడం కోసం మైదానంలో సర్వశక్తులూ ఒడ్డే క్రికెటర్ గౌతమ్ గంభీర్.. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల పిల్లల చదువు కోసం చేతనైన సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల చత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో మావోయిస్టుల దాడిలో అమరులైన 25 మంది జవాన్ల పిల్లల చదువులకు అయ్యే ఖర్చునంతా తాను భరిస్తానని ప్రకటించాడు. మరణించిన సైనికులకు నివాళులర్పిస్తూనే తన నిర్ణయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు.!
‘ద గౌతమ్ గంభీర్ ఫౌండేషన్’ పేరుతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఇకపై ఆ 25 మంది సైనికుల పిల్లల చదువు బాధ్యతను భుజానికెత్తుకుంటుందని ట్విటర్ పేజీలో పేర్కొన్నాడు. ‘దేశం కోసం ప్రాణాలర్పించడం.. దేశం కోసం క్రికెట్ ఆడడం ఎప్పుడూ ఒక్కటి కావు. సైనికుల త్యాగం మరేదానితో పోల్చలేనిది. వార్తా పత్రికలో మరణించిన సైనికుల ఫొటోలు చూసిన తరువాత నా గుండె బద్దలైంది. వారి త్యాగానికి మనం ఏమిచ్చినా తక్కువే. అయితే వారి పిల్లలను ప్రయోజకులను చేయడం ద్వారా కొంతైనా వారి కలలు నెరవేర్చినవారమవుతాం. అందుకే మరణించిన ఆ 25 మంది సైనికుల కుటుంబాల్లోని పిల్లల చదువు బాధ్యతలను మా ఫౌండేషన్ చూసుకుంటుంద’ని పేర్కొన్నాడు.