హీరోలపై గౌరవం పెరిగింది
‘‘కొందరు ‘వైశాఖం’ ట్రైలర్ చూసి ఈ కుర్రాడు రవితేజలా ఉన్నాడన్నారు. నాకొచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అది. అయితే దాన్ని తలకు ఎక్కించుకోను. చిన్నప్పట్నుంచి పవన్కల్యాణ్గారంటే ఇష్టం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్టార్స్, హీరోలు పడే స్ట్రగుల్స్ తెలిశాయి. హీరోలందరిపై గౌరవం పెరిగింది. వాళ్లందరూ నాకు స్ఫూర్తి’’ అన్నారు హరీశ్. జయ. బి దర్శకత్వంలో హరీశ్ హీరోగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. హరీశ్ చెప్పిన సంగతులు...
► కొత్తవాళ్లు ఛాన్సుల కోసం ఎలా కష్టపడతారో నేనూ అలాగే కష్టపడ్డా. ‘ప్రేమ ఇష్క్ కాదల్’లో ఓ హీరోగా నటించా. ఆ తర్వాత పలు ఛాన్సులొచ్చాయి. అయితే.. మళ్లీ మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఓ పర్ఫెక్ట్ ఫ్లాట్ఫామ్ కోసం ప్రయత్నిస్తున్న టైమ్లో జయగారిని కలిశా. చాలా ఆఫీసులకు వెళ్లి ఆడిషన్ ఇచ్చినట్టే ఇచ్చా. నాకు ఛాన్స్ ఇస్తారో? లేదో? అనే డౌట్ ఉండేది. తర్వాత ఓ నెలకు ఫోన్ చేశారు. సోలో హీరోగా నా మొదటి చిత్రమిది.
► కథ కంటే ముందు జయ మేడమ్ టైటిల్ చెప్పారు. ‘వైశాఖం’ అనగానే పాజిటివ్ వైబ్స్ కలిగాయి. కథ చెబుతున్నప్పుడు... నాకు నేనుగా హీరో పాత్రలోకి వెళ్లాను. కథలో అంత డెప్త్ ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్లోనో, స్నేహితులు, చుట్టాల లైఫ్లోనో జరిగిన సంఘటనలు సినిమాలో ఉంటాయి. ఓ క్లాస్ సిన్మాను మాసీగా చూపించడం జయ మేడమ్ స్ట్రెంగ్త్. ఈ సిన్మాలో నాది కాస్త పొగరు, ఆటిట్యూడ్ ఉన్న పక్కింటి కుర్రాడి పాత్ర.
► కొత్తవాళ్లతో సినిమాకు రాజుగారు ఎందుకింత ఎక్కువ ఖర్చు పెడుతున్నారనే డౌట్ వచ్చింది. కానీ, ఆయన కథపై నమ్మకంతో ఖర్చు పెట్టారు. బహుశా... కొత్తవాళ్లతో కజికిస్థాన్ వెళ్లి అంత ఖర్చుపెట్టి ఎవరూ మూడు పాటలు తీయాలనుకోరు. ఐయామ్ లక్కీ టు వర్క్ విత్ దెమ్.
► ఆర్.జె. సినిమాస్ సంస్థలో బీఏ రాజుగారు నిర్మాతగా మరో సినిమా చేస్తున్నా. సెప్టెంబర్లో ఆరంభ మవుతుంది. తమిళంలో హీరోగా నటించిన ‘మున్నోడి’ గత నెలలో విడుదలైంది. అక్కడ్నుంచి ఛాన్సులొస్తున్నాయి. స్టార్స్ సిన్మాల్లో విలన్ రోల్స్ చేయడానికి కూడా నేను రెడీ.