కోవన్ కేసులో తమిళనాడుకు ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: వామపక్ష ప్రజాగాయకుడు కోవన్ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను రెండురోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగించాలన్న తమిళనాడు సర్కార్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోవన్పై జయలలిత ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోవన్కు మద్రాస్ హైకోర్టు ఊరట కల్పించింది. ఆయనకు విధించిన పోలీసు కస్టడీపై స్టే విధించింది. దీనిని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ ఎఫ్ఎంఐ కలిఫుల్లా, యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్ను విచారించింది. కోవన్ను పోలీసుల కస్టడీకి అప్పగించాలన్న తమిళనాడు అభ్యర్థనలో ఎలాంటి యోగ్యత లేదంటూ కోర్టు తోసిపుచ్చింది.
అతివాద వామపక్ష సాంస్కృతిక సంస్థ 'మక్కల కలై ఇలక్కియ కజగం' తరఫున పాటలు పాడే 54 ఏళ్ల కోవన్ను అక్టోబర్ 30న దేశద్రోహం ఆరోపణలపై తమిళనాడు ప్రభుత్వం అరెస్టు చేసింది. ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఆన్లైన్లో వీడియోలు అప్లోడ్ చేసి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయనపై అభియోగాలు మోపారు.