‘ఆనందో బ్రహ్మ’ అంటూ వెళ్లిపోయారు...
1980ల్లో... టీవీ చూడడమే ఓ క్రేజ్. ముఖ్యంగా దూరదర్శన్‌లో వచ్చే ‘ఆనందో బ్రహ్మ’ సీరియల్ చూడటమంటే ఇంకా ఇంకా క్రేజ్. వారం వారం అరగంట సేపు వచ్చే ఆ సీరియల్ కోసం వారమంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు తెలుగు ప్రేక్షకులు. అన్నీ జోకులే. అవి చూసి పొట్ట పట్టుకోకుండా నవ్వనివాడుంటే ఒట్టే. ‘ఆనందో బ్రహ్మ’ అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం ట్రేడ్‌మార్క్. ఒక కామెడీ సీరియల్‌తో తెలుగునాట సూపర్‌స్టార్ కావడమంటే ఒక్క ధర్మవరపుకే చెల్లింది. జోక్స్ అందరూ పేలుస్తారు. కానీ ధర్మవరపు జోక్స్ పేల్చే స్టయిల్, ఆ మాట విరుపు, ఆ ఎక్స్‌ప్రెషన్సూ చూస్తే నవ్వుకి కూడా తెగ నవ్వొచ్చేస్తుంది.
హాస్యనటుడిగా బుల్లి తెరపై, వెండి తెరపై ఆయన వేసిన ముద్ర చిరస్మరణీయం... సదా స్మయిలనీయం. 24 ఏళ్ల సినీ ప్రస్థానంలో వందలాది పాత్రలతో తెలుగు హృదయాల్లో శాశ్వత స్థానం సముపార్జించుకున్నారాయన.ఆరో తరగతిలో బీజం: ధర్మవరపు సొంతవూరు ప్రకాశం జిల్లా కొమ్మినేనివారి పాలెం. ఆ ఊరికి అయిదు కిలోమీటర్ల దూరంలోని వైదరలో ఆరో తరగతి చదువుతుండగా ‘దొంగ వీరడు’ అనే నాటకంలో మురళి అనే చిన్న పిల్లాడి వేషం వేసే అవకాశం వచ్చింది. ఆ స్కూల్లో 550 మంది స్టూడెంట్స్ ఉంటే, ఏరికోరి ధర్మవరపునే ఎంచుకున్నారు. అలా ఆయన మనసులో తొలి నటనా బీజం పడింది. అది ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా ఎదుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఒంగోలులో ప్రజా నాట్యమండలితో కలిసి చాలా నాటకాలు ప్రదర్శించారు.
ఊహించని మలుపు: స్నేహితులతో కలిసి సరదాగా గ్రూప్-2 ఎగ్జామ్స్ రాస్తే, హైదరాబాద్‌లో ఉద్యోగం లభించింది. కేవలం సినిమాల్లో ప్రయత్నాల కోసం హైదరాబాద్‌లో ఉద్యోగిగా చేరారు. మొదట్లో అనేక రేడియో కార్యక్రమాలు చేశారు. అప్పుడే ‘దూరదర్శన్’ కొత్తగా మొదలైంది. కొన్నాళ్ల తర్వాత దూరదర్శన్‌లో సీరియల్స్ మొదలుపెట్టారు. తొలి తెలుగు, సీరియల్ ‘అనగనగా ఒక శోభ’ సృష్టికర్త ఆయనే. ఆ తర్వాత ‘బుచ్చిబాబు’ సీరియల్ కూడా ఆయనే రాశారు. ఇక ‘ఆనందో బ్రహ్మ’ అయితే ఆయన్ను స్టార్‌ని చేసేసింది. జయమ్ము నిశ్చయమ్మురా: జంధ్యాల పరిచయం ధర్మవరపుని వెండితెర మీదకు తీసుకొచ్చింది. ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో జంధ్యాల బలవంతం మేరకు (1989) రంగనాథం పాత్ర చేశారు.
నిజానికి అది సుత్తి వీరభద్రరావు చేయాల్సిన పాత్ర. ఆయన చనిపోవడంతో ధర్మవరపుతో చేయించారు. ఆ సినిమాకు ఆయన అందుకున్న పారితోషికం 7500 రూపాయలు. ఈ సినిమా విడుదల కాకముందే సీనియర్ నిర్మాత కె.రాఘవ ‘అంకితం’ సినిమాలో పిలిచి వేషం ఇచ్చారు. జంధ్యాలతో ధర్మవరపు అనుబంధం ప్రత్యేకమైంది. జంధ్యాల దర్శకత్వంలో ‘లేడీస్ స్పెషల్, బావా బావా పన్నీరు, బాబాయ్ హోటల్, జిందాబాద్, ష్ గప్‌చుప్’ తదితర సినిమాలు చేశారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’తోనే హాస్యనటునిగా మంచి మార్కులు సంపాదించేశారు. అందులో స్కూలు టీచర్‌గా పరీక్ష పేపర్లు దిద్దే సన్నివేశాన్ని చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుని మరీ నవ్వుతారు.
తెలుగుదనమున్న హాస్యం: ధర్మవరపు తన కెరీర్లో ఎన్నడూ వెనుతిరిగి చూడాల్సిన సందర్భమే రాలేదు. తోటి హాస్యనటులకు దీటుగా తనదైన మార్కు హాస్యంతో పరిశ్రమలో నిలబడ్డారు. ఎక్కడా అతి లేకుండా, పరిధులు దాటకుండా, అశ్లీలతకు దూరంగానే హాస్యాన్ని పండించారు. వాచకంలో స్పష్టత, తెలుగుదనం ఉట్టిపడడం ఆయనలోని ప్రత్యేకత. ఆయన డైలాగ్ మాడ్యులేషన్, ఆయనకంటూ ఓ శైలిని సృష్టించిపెట్టింది.
అసలు కొన్ని కొన్ని పాత్రలైతే ఆయనను తప్ప ఎవర్నీ ఊహించుకోలేం. స్వాతికిరణం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, ఫ్యామిలీ సర్కస్, లీలామహల్ సెంటర్, అమ్మ-నాన్న-ఓ తమిళమ్మాయి, ఒక్కడు, ఆనందం, వెంకీ, రెడీ, దూకుడు... తదితర చిత్రాల్లోని పాత్రలు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. ‘ఒక్కడు’ సినిమాలో ‘నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో’... అంటూ మొబైల్ నెంబర్ చెప్పే తీరు సూపర్. ‘తోక లేని పిట్ట’ సినిమాతో దర్శకునిగానూ తన ప్రతిభ కనబర్చారు. చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు.కొన్నాళ్లుగా కేన్సర్‌తో పోరాడుతున్నా, ఎక్కడా అధైర్యపడలేదు. చివరి క్షణం వరకూ నవ్వుతూ, నవ్విస్తూనే ఉన్నారు. సినిమాలకూ దూరం కాలేదు. ఆనందంగా బతకడమే తన ఫిలాసఫీ అని చెప్పిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి క్షణం వరకూ అదే పద్ధతిని అనుసరించారు. నవ్వుకి ఆనందయోగం పట్టించిన ధర్మవరపు ఎప్పటికీ చిరంజీవే!
‘సాక్షి’ టీవీలో ‘డింగ్‌డాంగ్’
‘సాక్షి’ చానల్‌తో దర్మవరపు సుబ్రమణ్యంది విడదీయరాని అనుబంధం. అప్పుడెప్పుడో దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఆనందో బ్రహ్మ’ కార్యక్రమంతో తెలుగులోగిళ్లలో నవ్వుల్ని పంచిన ధర్మవరపు... మళ్లీ ‘సాక్షి’ చానల్లో ప్రసారమవుతున్న.. ‘డింగ్ డాంగ్’ కార్యక్రమం ద్వారా మరోసారి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు. సెటైరికల్‌గా సాగే ఈ కార్యక్రమం అటు చానల్‌కే కాక, ధర్మవరపుకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎంతో ఇష్టంతో ఆయన ఈ కార్యక్రమం చేసేవారు. నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం దాదాపు 350 ఎపిసోడ్స్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. తొలినాళ్లలో వారానికి ఓసారి ఈ కార్యక్రమం ప్రసారమయ్యేది. అయితే... ఈ కార్యక్రమానికి వస్తున్న ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకొని వంద ఎపిసోడ్స్ తర్వాత నుంచి వారానికి రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది సాక్షి చానల్. ధర్మవరపు ప్రతిభ కారణంగా రెండు సార్లు ఈ కార్యక్రమం జాతీయ పురస్కారాలను కూడా అందుకుంది. ధర్మవరపుకు ఈ కార్యక్రమంపై ఎంతటి మమకారం అంటే... మిగతా చానల్స్ వారు ఇలాంటి కార్యక్రమమే తమకూ చేసిపెట్టమని అడిగినా... ఆయన ససేమిరా అనేవారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, చివరకు ఫారిన్ షూటింగ్ ఉన్నా... ‘డింగ్ డాంగ్’ కార్యక్రమానికి ఇబ్బంది కలుగకుండా.... షెడ్యూల్‌ని ప్లాన్ చేసుకునేవారు ధర్మవరపు. ఆయన మరణం సాక్షికి నిజంగా తీరని లోటే.