వైభవంగా నారసింహుడి జయంతుత్సవాలు
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో వెలసిన లక్ష్మీనృసింహస్వామి జయంతి మహోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. నృసింహస్వామి అవతార దినమైన వైశాఖ శుద్ధ చతుర్దశిని పురష్కరించుకుని స్వామి జయంతి ఉత్సవాన్ని మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలతో మొదలైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి కొలువుంచి వేదపండితుల వేద మంత్రోచ్చారనల మధ్య స్వాతి , సుదర్శన హోమాలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ పెరుమాల్ తయార్, 108 కలశ తిరుమంజనం, అవతార ఉత్సవం అనంతరం ఆస్థానం గోష్టి నిర్వహించారు. రాత్రి తమిళనాడు ప్రాంతములోని శ్రీరంగం పట్టణం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల పూలతో విశేష పుష్పాలతో ఉత్సవ పల్లకిని అలకంరించి ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం శయనోత్సవ శేవతో కార్యక్రమాన్ని ముగించారు.