ఆకుమాడు తెగులుతో తగ్గనున్న దిగుబడి
ఆలూరు రూరల్: రాష్ట్రంలో మదనపల్లి తర్వాత ఎక్కువగా కర్నూలు జిల్లాలో టమాట పండుతోంది. ఈ ఏడాది బోరుబావులు, వర్షాధారం కింద 15 వేల హెక్టార్లలో పూసారుబీ, ఆర్కావికాస్ రకాలను రైతులు సాగు చేశారు. పంట సాగై ఇప్పటికి దాదాపు రెండు నెలలు కావస్తోంది. అయితే వర్షాలు సరిగా పడకపోవడంతో మొక్కల్లో ఎదుగుదల లోపించి పూత (సాగైన 40 రోజులకు వస్తుంది) సరిగా రావడం లేదు.
కాయల్లో( సాగైన 50 రోజుల నుంచి 60 రోజులకు వస్తుంది) కూడా నాణ్యత లోపిస్తోంది. ఆలూరు, ఆస్పరి తదితర ప్రాంతాల్లో కాయతొలుచు పురుగు మొక్కలను తినేస్తోంది. ఆకుమాడు తెగులు అక్కడక్కడా కనిపిస్తోందని ఆలూరు హార్టికల్చర్ అధికారి జయరామిరెడ్డి (8374449280) తెలిపారు. మంచి దిగుబడులు సాధించాలంటే రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
పురుగుల నివారణ ఇలా..
వర్షాలు లేకపోవడం, వాతావరణంలో మార్పులతో టమాటకు కాయతొలుచు పురుగు ఆశించింది. ఇది 28 రోజుల నుంచి 35 రోజుల్లోపు లేత ఆకులను, కొమ్మలను తినేస్తుంది. వీటిని ఇలాగే వదిలేస్తే కాయలను కూడా తినేస్తాయి. నివారణ కోసం ప్లూబెండమైట్ 0.3 మి.మీ. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆకు అడుగుభాగంలో రసాన్ని పీల్చే పురుగులు ఉంటాయి. వీటి ప్రభావంతో తొలిదశలో ఆకుల చివర పసుపుపచ్చగా మారుంది. తుది దశలో ఆకు అంతా ఎర్రబడి ముడుచుకుపోతుంది. నివారణకు డైమితోయెట్ లేదంటే మిథైల్ లేదంటే డెమాటాన్ 2 మి.మీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
రబ్బరు పురుగు కూడా కాయలను నాశనం చేస్తాయి. వీటి నివారణకు కిలో బెల్లంలో తగినంత నీటిని కలిపి పాకం చేసి పంటపై చల్లాలి.
ఆకుమాడు తెగులు..
ఆకులు, కాండం, కాయల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడితే దీనిని ఆకుమాడు తెగులుగా నిర్ధారించవచ్చు. ఈ తెగులు సోకితే క్రమేణా ఆకులు మాడి ఎండిపోతాయి. నివారణకు మూడు గ్రాముల కాప్టన్ లేదా మంకోజబ్ లేదా క్లోరోథాలానిల్ 2 గ్రా. లేదా ప్రోపికొనజోల్ 1 మి.మీ. మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో మూడు నుంచి నాలుగు సార్లు పిచికారీ చేయాలి.
కులుపు నివారణ తప్పనిసరి
పొలాల్లో కలుపు మొక్కలు పెరిగే ఆశించిన దిగుబడులు రావు. వీటి నివారణకు ఎకరాకు పెండిమిథాలిన్ 1.0 లీటర్ (తేలిక నేలలు), 1.2 లీటర్ (బరువు నేలలకు) 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి.
మొక్కలు
నాటిన 30 నుంచి 40 రోజుల వరకు గొర్రు లేదా గుంటకతో అంతర్ కృషి చేయాలి. మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కదిలించకుండా చూడాలి.