అణువిద్యుత్‌తోనే భవిష్యత్
– జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్
ఎచ్చెర్ల: భవిష్యత్ అవసరాలకు అణువిద్యుత్ తప్పనిసరి అని జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్మాణ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఎన్యూమరేటర్లకు చిలకపాలెంలోని శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత బొగ్గు కొరత వెంటాడుతుందని, అప్పుడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అసాధ్యం అని చెప్పారు. ఈ నేపథ్యంలో అణువిద్యుత్ ప్లాంట్లు నిర్మాణం తప్పనిసరి అన్నారు. ఈ ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం సాగుతుందన్నారు. దేశంలో మొత్తం 10 అణుప్రాజెక్టులు ఉన్నాయని, అటువంటి ప్రాజెక్టు మన జిల్లాలో నిర్మించడం జిల్లాకు జాతీయస్థాయి ప్రాధాన్యం లభించినట్లేనని తెలిపారు. ఢిల్లీ, చెన్నై వంటి నగర ప్రాంతాల సమీపంలో అణుపార్కులు ఉన్నాయని చెప్పారు. భవిష్యత్‌లో అణువిద్యుత్ ప్లాంటులు, సౌర, పవన విద్యుత్‌లకు ప్రాధాన్యం పెంచవల్సిన అవసరం ఉందన్నారు. గతంలో 1894 చట్టం ప్రకారం భూసర్వేలు చేసేవారని, 2014లో కొత్త భూ సేకరణ చట్టాలు వచ్చాయన్నారు. ఈ చట్టాలు మేరకు ప్రజల అభిప్రాయం క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు ప్రజలను చైతన్య పర్చటం, అణువిద్యుత్ ప్రాధాన్యం వివరించటం కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి.మురళీకృష్ణ, ఎచ్చెర్ల డీటీ బి.శ్రీహరిబాబు, ఆర్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.