ఉన్నత విద్యా ప్రమాణాలు పెరగాలి
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఉన్నత విద్యా శాతం పెరగాలంటే విద్యా ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అసోం గవర్నర్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం చాన్స్‌లర్ జేబీ.పట్నాయక్ అన్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 17వ స్నాతకోత్సవం బుధవారం జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని డిగ్రీలను ప్రదానం చేశారు.
కేంద్ర ప్రభుత్వం 12వ ప్రణాళికలో ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఉన్నత విద్య చదివే వారి సంఖ్యను 25 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ఉన్నత విద్యా శాతం పెంచాలంటే నాణ్యమైన, అర్హత కల్గిన అధ్యాపకులు అవసరమన్నారు. ఈ కొరతను తీర్చడానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. అలాగే నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. నాణ్యత కల్గిన విద్యా సంస్థల రేటింగ్‌లో మన దేశంలోని విద్యాసంస్థలు వెనుకబడి ఉన్నాయన్నారు.
సంస్కృత భాష అభివృద్ధికి సంస్కృత కమిషన్ ఏర్పాటయిందన్నారు. పాఠశాల విద్య నుంచే సంస్కృత భాషను తప్పనిసరి సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టాలని సూచించారు. మన దేశంలో ఎక్కువ మంది యువత తాగుడుకు అలవాటు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయాలు పెంచుకునేందు ప్రభుత్వాలు విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తున్నాయని అన్నారు. దీనిని రూపుమాపేందుకు విద్యావంతులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.
సంస్కృత పండితులు ప్రియబ్రతదాస్ స్నాతకోపన్యాసం చేశారు. వేదాల్లో బ్రహ్మచర్యం ప్రాముఖ్యతను, బ్రహ్మచారి గొప్పతనాన్ని వివరించారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడమే విద్య అంతిమ లక్ష్యం కావాలని అభిప్రాయపడ్డారు. మనిషి తన ప్రయాణాన్ని సత్యాన్ని చేరుకునే వరకు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీసీ హరేకృష్ణ శతపతి, రిజిస్ట్రార్ ఉమాశంకర్, వేదిక్ యూనివర్సిటీ వీసీ కె.ఈ దేవనాధన్, డీన్ రాధాక్రాంత్ ఠాకూర్ పాల్గొన్నారు.
డిగ్రీలు ప్రదానం
సంస్కృత విద్యాపీఠం 17వ స్నాతకోత్సవం సందర్భంగా ముగ్గురికి మహామహోపాధ్యా య, ముగ్గురికి వాచస్పతి, 50 మందికి పీహెచ్‌డీలు, 60 మందికి ఎంఫిల్, 277 మందికి ఎంఏ, 11 మందికి ఎంఎస్సీ, 118 మందికి బీఏ, 17 మందికి బీఎస్సీ, 41 మందికి ఎం ఈడీ, 149 మందికి బీఈడీ డిగ్రీలను ప్రదానం చేశారు. అలానే విద్యాపీఠం మ్యాగజైన్ ‘సుముసి’ని జేబీ.పట్నాయక్ ఆవిష్కరించారు.