బుర్జ్ ఖలీఫాను తలదన్నేలా..!
రియాద్ : ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని తలదన్నే కట్టడం మరొకటి అతి త్వరలో రాబోతోంది. బుర్జ్ ఖలీఫా కంటే 590 అడుగులు ఎక్కువ పొడవు ఉండబోతుంది. అదే సౌదీ అరేబియాలోని ఏడారి ప్రాంతంలో నిర్మితమవుతున్న జెడ్డా టవర్.
2020లో జెడ్డా టవర్‌ను ప్రారంభించనుంది సౌదీ అరేబియా. దాదాపు 1.4 బిలియన్ డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. దీని ఎత్తు 3,280 అడుగులు(1000మీటర్లు). ఇప్పటికే 239 అడుగుల పాటు(72మీటర్లు) నిర్మాణాన్ని పూర్తి చేశారు. దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలీఫా ఎత్తు 2690 అడుగులు(828 మీటర్లు).
మొత్తం ఐదు కోట్ల డెబ్భై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జెడ్డా టవర్‌ను నిర్మిస్తున్నారు. కమర్షియల్ భవనాలు, హోటళ్లు, ఇళ్లు, ఆఫీస్‌లు, టూరిస్ట్‌లకు సంబంధించిన కాంప్లెక్స్‌లు జెడ్డా టవర్‌లో కొలువుదీరతాయి. సౌదీ అరేబియా ఆర్థిక నగరమైన జెడ్డాకు ఈ టవర్ మణిహారంగా మారుతుందని అంటున్నారు.
ప్రాజెక్ట్‌కు అడుగడునా అడ్డంకులే..
జెడ్డా టవర్ ప్రాజెక్టు 2013లో ప్రారంభమైంది. ఆ తర్వాతి కొద్దికాలానికే సౌదీ అరేబియా రాజు అల్ వాలిద్ బిన్ తలాల్, జడ్డా కన్స్ట్రక్షన్ కంపెనీ ‘బిన్ లాడెన్ గ్రూప్’ చైర్మన్ బాకర్ బిన్ లాడెన్లు అవినీతి కేసులో చిక్కుకున్నారు. దీంతో టవర్ నిర్మాణ వేగం మందగించింది. ముందస్తుగా అనుకున్న ప్రకారమే 2020 కల్లా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జెడ్డా ఎకానమిక్ కంపెనీ అధికారులు వెల్లడించారు.