బీహార్లో ‘తెలంగాణ మోడల్ విద్య’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఎస్సీ ఆశ్రమ పాఠశాలల విద్యావిధానం ఇతర రాష్ట్రాలను సైతం ఆకట్టుకుంటోంది. ఆ పాఠశాలల స్ఫూర్తితో తమ రాష్ట్రంలోనూ మోడల్ విద్యావిధానాన్ని అమలు చేయాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆశ్రమపాఠశాలల ఏర్పాటు, టీచర్ల నియామకం, ఇంజనీరింగ్ వింగ్ మోడల్ వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు తెలంగాణ సీపీఆర్వో కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల బృందాలు పలు రాష్ట్రాలను సందర్శించాయి. ఆయా రాష్ట్రాల్లో ఎస్సీల విద్యా సౌకర్యాల కోసం అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేశాయి.
తెలంగాణలో పర్యటించిన బీహార్ అధికారులను ఇక్కడ అమలు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల ఆశ్రమ పాఠశాలల మోడల్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలోని 1.25 లక్షల విద్యార్థుల కోసం ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.