ఆ పీపీఏలు పెను భారమే!
(మహమ్మద్ ఫసీయొద్దీన్)
ఉమ్మడి రాష్ర్టంలో జెన్కోతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) విషయంలో రాష్ర్ట ప్రభుత్వం తన వాదనను సమీక్షించుకోకపోతే భవిష్యత్తులో భారీ నష్టం తప్పదని విద్యుత్‌రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పటి పీపీఏలను అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతుండగా.. ఏపీ సర్కారు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో పీపీఏల అమలు వల్ల ఏపీ ప్రాజెక్టుల నుంచి కొంత విద్యుత్ వాటా వస్తుందని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆమోదం లేదన్న కారణం చూపి ఆ పీపీఏలు చెల్లవని ఏపీ వాదిస్తోంది. ఈ వివాదంపై విచారణ జరుపుతున్న కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) మరో రెండు నెలల్లోగా తీర్పును ప్రకటించే అవకాశముంది. నిజానికి అప్పటి పీపీఏలు అమలైతే రాష్ట్రానికి తాత్కాలికంగా ఊరట లభించనుంది. అయితే ప్రస్తుతం రాష్ర్టంలో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులు వచ్చే రెండుమూడేళ్లలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అప్పటికి ఇవే పీపీఏలు గుదిబండగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత దాదాపు 20 ఏళ్ల వరకు ఆ భారాన్ని మోయాల్సి ఉంటుందని చెబుతున్నారు. పీపీఏల కొనసాగింపునకు అనుకూలంగా సీఈసీ నిర్ణయం వెల్లడిస్తే రెండు రాష్ట్రాలు అందుకు కట్టుబడి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆలోపే ఈ విషయంపై రాష్ర్ట ప్రభుత్వం పునరాలోచన జరపాల్సి ఉంది.
ఏపీకి 1198 మెగావాట్లు.. తెలంగాణకు 862 మెగావాట్లు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం ఉమ్మడి రాష్ర్టంలోని విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం వాటాలున్నాయి. పీపీఏల కొనసాగింపు వల్ల ఉత్పత్తి దశలో ఉన్న ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం తెలంగాణకు అదనంగా 370 మెగావాట్ల కరెంటు వస్తోంది. ఏపీలో నిర్మాణ దశలో ఉన్న, ఉత్పత్తి దశకు చేరిన ప్రాజెక్టుల నుంచి సైతం రాష్ర్ట ప్రభుత్వం వాటా కోరుతోంది. అయితే పాత పీపీఏలు కొనసాగితే తెలంగాణలో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల నుంచి సైతం ఏపీకి 46.11 శాతం వాటా ఇవ్వాల్సి రానుంది. ఉమ్మడి రాష్ట్రంలో పీపీఏలు జరిగి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, నిర్మాణం పూర్తయి ఉత్పత్తి దశలో ఉన్న ప్రాజెక్టులను పరిశీలిస్తే తెలంగాణలో సింగరేణి ఆధ్వర్యంలో 1200 మెగావాట్లు, కేటీపీఎస్ ఏడో దశ కింద 800 మెగావాట్లు, భూపాలపల్లి రెండో దశలో 600 మెగావాట్లు కలిపి మొత్తం 2600 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. అదే ఏపీలో అయితే 1600 మెగావాట్లతో కృష్ణపట్నం, 600 మెగావాట్లతో ఆర్టీపీపీ ప్రాజెక్టులు కలిపి మొత్తం 2200 మెగావాట్ల విద్యుత్ మాత్రం అందుబాటులోకి రానుంది. దీంతో పీపీఏలు అమలైతే తెలంగాణ ప్లాంట్ల నుంచి 1198 మెగావాట్ల వాటాను ఏపీకి ఇవ్వాల్సి ఉంటుంది.
ఉత్పత్తి వ్యయం చూసుకున్నా నష్టమే
తెలంగాణ ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో నిర్మితం కావడంతో యూనిట్ విద్యుదుత్పత్తి వ్యయం సగటున రూ. 4 వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఏపీలోని ప్రాజెక్టులను పరిశీలిస్తే.. 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆర్టీపీపీ-4 ప్రాజెక్టు కోసం ఇప్పటికే అడ్డగోలుగా వ్యయం చేశారు. ఈ ప్రాజెక్టు నుంచి యూనిట్ విద్యుదుత్పత్తికి రూ. 7 వరకు ఖర్చుకానుంది. ఇంత వ్యయంతో విద్యుదుత్పత్తి చేస్తే ఆ రాష్ర్టం తీవ్ర నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ పీపీఏలు కొనసాగితే ఆర్టీపీపీ నుంచి తెలంగాణకు విద్యుత్ రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జెన్కోకు ఏటా వందల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. పీపీఏల్లో ఈ విషయం స్పష్టంగా రాసి ఉంది. ఇక కృష్ణపట్నం మెగా విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మెగా విద్యుత్తు ప్రాజెక్టుల పాలసీ ప్రకారం ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 10 శాతాన్ని మరో రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. కృష్ణపట్నంలోని 1600 మెగావాట్ల నుంచి తెలంగాణకు 160 మెగావాట్లు అనివార్యంగా రానున్నాయి. ఇక పీపీఏలు అమలైతే వాటా ప్రకారం 862 మెగావాట్ల కరెంట్ దక్కుతుంది. కానీ ఏపీకి తెలంగాణ నుంచి ఇవ్వాల్సిన విద్యుత్ మాత్రం ఇంతకన్నా ఎక్కువ కావడం గమనార్హం. పీపీఏలు అమలు కాకపోయినా 160 మెగావాట్లు రానున్నందున పీపీఏలను వదులుకుంటే 700 మెగావాట్లను మాత్రమే తెలంగాణ కోల్పోతుంది. అయితే ఏపీకి ఇవ్వాల్సిన 1198 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికే మిగులుతుంది. పైగా విదేశీ బొగ్గును వినియోగిస్తూ అధిక వ్యయంతో నడిచే ఏపీ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తులో తెలంగాణకు తీవ్ర నష్టమే మిగులుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పునరాలోచన తప్పదు
పాత పీపీఏల అమలు వల్ల రాష్ట్రానికి దీర్ఘకాలంలో భారీ నష్టాలు కలుగుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేయాలి. మరో రెండేళ్ల పాటు రాష్ట్రానికి అదనంగా 500 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ లోటును పూడ్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. ఉమ్మడి రాజధాని ఉన్న దృష్ట్యా కేంద్ర విద్యుత్ పూల్‌లో ఏపీ వాటా నుంచి 500 మెగావాట్లను తెలంగాణకు కేటాయించాలని కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి చేయాలి.
- కె. రఘు, విద్యుత్ రంగ నిపుణుడు