పేరుకే ఇద్దరు... ప్రేమలో ఒక్కరు
* గ్రేట్ లవ్ స్టోరీస్
‘ప్రేమలో ఉన్న గొప్పదనం ఏమిటంటే...
అది ‘బాధ’ను కూడా మహత్తరమైన శక్తిగా మారుస్తుంది!’
ఆమె: వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే... అది తన కోసమే అని ఆనందించే అందాల బొమ్మ కెల్లీ. ఎంతో చురుగ్గా ఉంటుంది. స్విమ్మింగ్, బైకింగ్, డ్యాన్స్... అనేకానేక కళలలో ఆరితేరిన ఆమె, తన భవిష్యత్ చిత్రపటాన్ని సుందరంగా చిత్రించుకుంది.
ఆమెకు తన వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలతో పాటు, తనకు కాబోయేవాడి గురించి కూడా ఎంతో అందమైన ఊహలు ఉన్నాయి.
అతడు: ధైర్యానికి మరోపేరులా ఉంటాడు జెస్సీ కాటిల్. అలా అని గంభీరంగా, ముఖం మాడ్చుకొనేం కనిపించడు. హుందాగా ఉంటాడు. తెలిసినవాళ్లతో మాత్రం సరదా సరదాగా ఉంటాడు. అమెరికాలో ఎన్ఇఒడి (నేవీ ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్) టెక్నీషియన్‌గా పని చేసే అతడు ఆపత్కాలంలో తన సత్తా చాటుతుంటాడు. జెస్సీని చూస్తే బాంబులే కాదు, భయాలు కూడా బెదురుతాయి.
అనగనగా ఒకరోజు...
బైస్ సిటీలో ఫేమస్ స్విమ్మర్ అయిన కెల్లీతో ఆరోజు అనుకోకుండా పరిచయం అయింది జెస్సీకి. ఆ పరిచయం దృఢపడి ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల మధ్యా స్నేహాలు విరిశాయి. రెండు కుటుంబాలూ తరచూ కలుసుకుని సంతోషాన్ని పంచుకునేవి. పిల్లలిద్దరి మనసుల్లో ఉన్న ప్రేమను అర్థం చేసుకున్నాయి. మంచి టైమ్ చూసి... కెల్లీ, జెస్సీలకు ఘనంగా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాయి.
ఇక వెళ్లొస్తానని...
‘‘నా మనసుకేదో భయంగా ఉంది’’ అంది కెల్లీ ఆ రోజు. ‘‘ఛ... భయమే మనల్ని చూసి పారిపోవాలి. దానికి నా దగ్గరో చిట్కా ఉంది. వెళ్లేప్పుడు నీ చిరునవ్వును పర్స్‌లో పెట్టుకొని వెళతాను. ఎప్పుడైనా భయమేసినప్పుడు ఆ చిరునవ్వుని చూస్తే చాలు... భయం పారిపోతుంది’’ అంటూ గట్టిగా నవ్వాడు జెస్సీ. ఆ నవ్వుతో కెల్లీ శృతి కలిపింది.
మరుసటిరోజు జెస్సీ అఫ్గానిస్తాన్‌కు వెళుతున్నాడు విధులు నిర్వహించడానికి. నాటికి ఆఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో న్యూస్‌పేపర్లు, టీవీ చానెళ్లు చెబుతూనే ఉన్నాయి. అందుకే కెల్లీలో ఆ కలవరపాటు!
రోజులు గడుస్తున్నాయి. ఆఫ్గానిస్తాన్ నుంచి తన ప్రియుడు రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందా అని లెక్కలు వేసుకుంటోంది కెల్లీ. జెస్సీ రాలేదు. కానీ గుండె చెదిరే వార్త ఒకటి వచ్చింది. మందుపాతర వెలికితీసే క్రమంలో జెస్సీ తీవ్రంగా గాయపడ్డాడు. ‘బతకడం కష్టం’ అంటూ డాక్టర్లు పెదవి విరిచారు.
కెల్లీ అల్లాడిపోయింది. తన ప్రాణ ప్రియుడి ప్రాణాలు కాపాడమని దేవుడిని అర్థించింది. ఆయన కరుణించాడు. జెస్సీ బతికాడు. కానీ ప్రాణాలు మిగిల్చిన దేవుడు కాళ్లు మాత్రం తీసుకెళ్లిపోయాడు!
హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు జెస్సీ. అతని కళ్లలో దైన్యం. జీవితాన్నే కోల్పో యాను అన్న నిర్వేదం. అతణ్నలా చూడలేకపోయింది కెల్లీ. ధైర్యం చెప్పబోయింది. ‘‘నా నవ్వులు ఇంకా నీ పర్సులోనే ఉన్నాయి, మర్చిపోయావా’’ అంటూ అందంగా నవ్వింది. కానీ జెస్సీ నవ్వలేదు. ‘‘అవిటివాడిని చేసుకుని ఏం సుఖపడతావ్, వెళ్లిపో’’ అన్నాడు ఎటో చూస్తూ. కెల్లీ మాట్లాడలేదు. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ‘నీతోనే నా జీవితం’ అన్న అర్థం స్ఫురించింది ఆ స్పర్శలో!
జెస్సీకీ ఎన్నో సర్జరీలు జరిగాయి. కృత్రిమ కాళ్లతో నడవటానికి కొన్ని నెలలు పట్టింది. అంతవరకూ అతణ్ని కళ్లలో పెట్టి కాచుకుంది కెల్లీ. ఎక్కడికి వెళ్లినా జెస్సీని తనతో తీసుకుపోయేది. బిడ్డను వీపున మోసినట్టుగా అతడిని మోసుకుపోతుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప ప్రేమ ఉండదు అంటూ కితాబు ఇచ్చారు!ఇప్పుడు వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పేరుకే ఇద్దరు. ప్రేమలో ఒక్కరు!